నవతెలంగాణ-హైదరాబాద్: తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లో నెల రోజులుగా నిలిచిపోయిన బ్రిటిష్ రాయల్ నేవీ ఎఫ్-35బి స్టెల్త్ యుద్ధ విమానానికి ఎట్టకేలకు మరమ్మతులు పూర్తయ్యాయి. యుద్ధ విమానం హైడ్రాలిక్ సిస్టమ్‌లో తలెత్తిన లోపాన్ని బ్రిటిష్ ఇంజనీర్ల బృందం విజయవంతంగా సరిచేసింది. అనంతరం విమానాన్ని హ్యాంగర్ నుంచి బయటకు తీసుకొచ్చారు. మరమ్మతులు విజయవంతం కావడంతో నేడు ట్రయల్ ఫ్లైట్ నిర్వహించేందుకు నిపుణులు సన్నాహకాలు చేస్తున్నారు. అనంతరం ఇది యూకేకి ఎగిరిపోనుంది.
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాల్లో ఒకటైన బ్రిటన్ దేశానికి చెందిన ఎఫ్-35 బీ (F-35B ) 40 రోజులుగా కేరళలోని తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లోనే నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇండో-యూకే నేవీ విన్యాసాల్లో పాల్గొన్న ఈ ఎఫ్-35బి విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో ఆ విమానాన్ని జూన్ 14న అర్ధరాత్రి తర్వాత తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. తొలుత ప్రతికూల వాతావరణం, ఇంధన కొరత కారణంగా విమానాన్ని అత్యవసరంగా దించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ ఫైటర్ జెట్‌లో ఇంజినీరింగ్ సమస్య తలెత్తినట్లు ఆ తర్వాత యూకే అధికారులు వెల్లడించారు.
విమానానికి మరమ్మతులు చేయడానికి అదేరోజు రాత్రి ఏడబ్ల్యూ 101 మెర్లిన్ హెలికాఫ్టర్‌లో నిపుణులు వచ్చారు. మరమ్మతులు చేసినా విమానం మొరాయించింది. అప్పటి నుంచి తిరువనంతపురం ఎయిర్‌పోర్టులోనే ఉంది. ఆ తర్వాత పరికరాలతో సహా 24 మంది స్పెషల్ ఎక్స్‌పర్ట్స్ బృందం వచ్చి విమానానికి మరమ్మతులు చేపట్టింది. వారు చేపట్టిన మరమ్మతులు విజయవంతం కావడంతో విమానాన్ని హ్యాంగర్ నుంచి బయలకు తరలించారు. ఇవాళ ట్రయల్ ఫ్లైట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనంతరం ఇది యూకేకు వెళ్లనుంది. ఈ విమానం షార్ట్ టేకాఫ్‌తోపాటు వర్టికల్ ల్యాండింగ్ అవుతుంది. అమెరికా సహా అతికొద్ది దేశాల ఎయిర్‌ఫోర్సుల వద్దే ఈ ఫైటర్ జెట్ ఉంది.