– మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అక్రమాలు: బోస్టన్‌లో రాహుల్ ఆరోపణ
బోస్టన్: దేశంలో ఎన్నికల కమిషన్ రాజీ పడిపోయిందని, అసలు ఆ వ్యవస్థలోనే ఏదో లోపం ఉన్నదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోలైన ఓట్ల లెక్కలపై ఆనుమానాలు వ్యక్తం చేస్తూ దీనిపై ఎన్నికల కమిషన్ స్పష్టత ఇవ్వాలని కోరారు. అమెరికాలోని బోస్టన్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ ప్రసంగిస్తూ మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగిన రోజు సాయంత్రం 5.30 గంటలకు పోలైన ఓట్ల వివరాలు ప్రకటించారని, అయితే రాత్రి 7.30 గంటలకు ప్రకటించిన వివరాల ప్రకారం దానికి అదనంగా మరో 65 లక్షల ఓట్లు కలిశాయని తెలిపారు. ‘ఎన్నికల కమిషన్ సాయంత్రం ఒక సంఖ్య చెప్పింది. ఆ తర్వాత రెండు గంటల వ్యవధిలోనే 65 లక్షల మంది ఓటేశారని తెలిపింది. ఇది భౌతికంగా అసంభవం’ అని రాహుల్ అన్నారు. ఒక ఓటు వేయడానికి ఎంత సమయం పడుతుందో వివరిస్తూ రాత్రి బాగా పొద్దు పోయే వరకూ క్యూ లైన్లలో భారీగా ఓటర్లు ఉంటే తప్ప ఓట్ల నమోదు ఆ స్థాయిలో పెరగడం సాధ్యం కాదని చెప్పారు. అయితే అక్కడ అలా జరగలేదని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాలలో తీసిన వీడియోలు అందజేయాలని కోరితే అందుకు నిరాకరించారని, ఆ తర్వాత ఎన్నికల చట్టాలలో చేసిన మార్పుల కారణంగా అలాంటి వాటికి పరిమితంగానే అవకాశం ఉన్నదని అన్నారు.
‘ఓటుకు, ఓటుకు మధ్య సుమారు మూడు నిమిషాల సమయం పడుతుంది. తెల్లవారుజామున రెండు గంటల వరకూ ఓటర్లు క్యూ లైన్లలో పెద్ద సంఖ్యలో బారులు తీరి ఉంటే తప్ప ఆ స్థాయిలో ఓటింగ్ పెరగదు. కానీ అలా జరగలేదు. వీడియోలు చూపాలని కోరితే నిరాకరించారు. ఆ తర్వాత ఎన్నికల చట్టాన్నే మార్చేశారు. ఇప్పుడు వీడియోలు అడిగే అవకాశం కూడా లేకుండా పోయింది’ అని రాహుల్ తెలిపారు. కాగా ఎన్నికల కమిషన్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తోసిపుచ్చింది. ఆయనను ఓ కళంకితుడిగా అభివర్ణించింది.
ఎన్నికల కమిషన్ రాజీ పడింది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES