నవతెలంగాణ-హైదరాబాద్: ఒడిశా భువనేశ్వర్‌లోని ప్రతిష్ఠాత్మక కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (KIIT)లో మరో విద్యార్థిని మృతిచెందింది. చనిపోయిన యువతిని నేపాల్ వాసిగా గుర్తించారు. కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కిట్)లో కంప్యూటర్ సైన్స్ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె స్వస్థలం నేపాల్ రాజధాని ఖాట్మాండుకు సుమారు 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీర్‌గంజ్ అని పేర్కొన్నారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో గర్ల్స్ హాస్టల్‌లోని తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న స్థితిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. దీంతో, యూనివర్సిటీ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీస్ కమిషనర్ సురేష్ దేవ్ దత్తా సింగ్ పేర్కొన్నారు. కిట్ లో స్టూడెంట్ అనుమానాస్పద మృతిపై ఒడిశా సమాచార, ప్రజా సంబంధాల శాఖ స్పందించింది. విద్యార్థిని మృతిపై సంతాపం తెలిపింది. నేపాల్ విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవుబా కూడా ఈ ఘటనపై స్పందించారు. యువతి మృతిపై పారదర్శక దర్యాప్తును నిర్ధారించేందుకు దౌత్య మార్గాల ద్వారా వెళ్లామని సోషల్ మీడియా ఎక్స్ లో పేర్కొన్నారు.
ఒడిశా కళింగ ఇన్‌స్టిట్యూట్‌లో నేపాల్ విద్యార్థి మృతి
- Advertisement -