Tuesday, April 29, 2025
Homeఆటలుకథ మారుతుందా?

కథ మారుతుందా?

Sunrisers in IPL 18

– పంజాబ్‌ కింగ్స్‌తో సన్‌రైజర్స్‌ ఢీ నేడు
– విజయంపై కన్నేసిన ఆరెంజ్‌ ఆర్మీ
ఐదు మ్యాచులు, నాలుగు పరాజయాలు, ఓ గెలుపు. ఐపీఎల్‌18లో సన్‌రైజర్స్‌ కథ ఇది. భారీ అంచనాలతో సీజన్‌ను మొదలెట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పూర్తిగా నిరాశపరిచింది. బ్యాట్‌, బంతితో పాటు ఫీల్డింగ్‌లోనూ చెత్త గణాంకాలను నమోదు చేసింది. సీజన్లో రెండో విజయం కోసం ఎదురుచూస్తున్న సన్‌రైజర్స్‌ నేడు బలమైన పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది.
నవతెలంగాణ-హైదరాబాద్‌
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతగడ్డపై మరో కీలక సమరానికి సిద్ధమైంది. వరుస పరాజయాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాట్‌ కమిన్స్‌ సేన.. కాస్త విరామం తర్వాత మళ్లీ గ్రౌండ్‌లోకి అడుగుపెడుతోంది. తొలి మ్యాచ్‌లో విధ్వంసక బ్యాటింగ్‌తో అదరగొట్టిన సన్‌రైజర్స్‌ ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో తేలిపోయింది. జట్టులోని కీలక బ్యాటర్లు ఆత్మవిశ్వాసం కోల్పోయినట్టు కనిపిస్తుండగా.. నేడు ఉప్పల్‌ స్టేడియంలో పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆరెంజ్‌ ఆర్మీ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు పంజాబ్‌ కింగ్స్‌ నాలుగు మ్యాచుల్లో మూడింట విజయాలు సాధించిన మంచి ఫామ్‌లో ఉంది. సన్‌రైజర్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ మ్యాచ్‌ నేడు రాత్రి 7.30 గంటలకు ఆరంభం.
బ్యాటర్లు మెరుస్తారా?
సన్‌రైజర్స్‌ సక్సెస్‌ ఫార్ములా టాప్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌ లైనప్‌పై ఆధారపడి ఉంది. ట్రావిశ్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మలు పవర్‌ప్లేలో పవర్‌ఫుల్‌ స్కోరు సాధించటం కీలకం. కానీ ఈ సీజన్లో ట్రావిషేక్‌ జోడీ అంచనాలను అందుకోలేదు. హెడ్‌ ఒకట్రెండు ఇన్నింగ్స్‌ల్లో మెరిసినా, ఆ తర్వాత డీలా పడ్డాడు. ఇషాన్‌ కిషన్‌ తొలి మ్యాచ్‌లో శతకబాదిన తర్వాతి మ్యాచుల్లో దారుణంగా తేలిపోయాడు. టాప్‌-3 బ్యాటర్లు పవర్‌ప్లేలోనే నిష్క్రమించటం సన్‌రైజర్స్‌ పతనానికి దారితీస్తోంది. తెలుగు తేజం నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఈ సీజన్లో తడబాటుకు గురవుతున్నాడు. బ్యాట్‌తో, బంతితో ఏమాత్రం ఆకట్టుకోవటం లేదు. హెన్రిచ్‌ క్లాసెన్‌ ధనాధన్‌పై ఎటువంటి అనుమానం లేదు. 15 ఓవర్ల తర్వాత క్రీజులోకి వస్తేనే క్లాసెన్‌ ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించగలడు. కానీ వరుస వికెట్లతో క్లాసెన్‌ పవర్‌ప్లే ముగియగానే క్రీజులోకి అడుగుపెడుతున్నాడు. యువ ఆటగాడు అనికెత్‌ వర్మ నిలకడగా మంచి ఇన్నింగ్స్‌లు ఆడినా.. గత రెండు మ్యాచుల్లో తేలిపోయాడు. సొంతగడ్డపై నేడు బ్యాటర్లు సమిష్టిగా మెరిస్తే మరో భారీ స్కోరుపై కన్నేయవచ్చు. బౌలింగ్‌ విభాగంలో పాట్‌ కమిన్స్‌, మహ్మద్‌ షమి టైటాన్స్‌పై రాణించారు. మిడిల్‌ ఓవర్లలో సన్‌రైజర్స్‌ స్పిన్నర్లు సైతం మాయ చేయగలిగితే ఆరెంజ్‌ ఆర్మీకి నేడు ఎదురుండదు!.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img