Wednesday, April 30, 2025
Homeతాజా వార్తలుకన్నయ్య మరణానికి కారుకులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి

కన్నయ్య మరణానికి కారుకులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి

– ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ప్రజాసంఘాల వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎస్టీ ఆదివాసీ కులానికి చెందిన నాయిని కన్నయ్య మరణానికి కారణమైన చిన్నన్నరెడ్డి, వారి కుటుంబ సభ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ గురువారం హైదరాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మెన్‌ బక్కి వెంకటయ్యకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశాయి. దీనిపై చైర్మెన్‌ స్పందిస్తూ నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలనీ, బాధితులకు తగిన న్యాయం చేయాలని సంబంధిత జిల్లా అధికారులకు ఫోన్‌ ద్వారా ఆయన ఆదేశాలిచ్చారు. మంచిర్యాల జిల్లా మంగెనపల్లి గ్రామానికి చెందిన నాయిని కన్నయ్య (28 )ను అదే గ్రామానికి చెందిన ఎనగంటి చిన్నన్న రెడ్డి నెల నెలా జీతం ఇవ్వకపోగా పెండింగ్‌ జీతం అడిగితే, భూతులు మాటలు తిట్టేవారని ప్రజాసంఘాల నేతలు తెలిపారు. తమ కుటుంబ సభ్యులతో వెట్టి చాకిరి చేయించుకునేవారని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా కన్నయ్య కుటుంబానికి చెందిన ఎకరం భూమిని ఎనగంటి హరీష్‌ రెడ్డి అక్రమంగా 2019లో పట్టా చేయించుకున్నారని ఆరోపించారు. కన్నయ్యను ఆర్థికంగా, మానసికంగా కుల పరంగా వేధించటంతో పురుగుల మందు తాగి చనిపోయారని తెలిపారు. కన్నయ్య చావుకు కారణమైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి ఐదెకరాల భూమి, రూ.50 లక్షల నష్టపరివారం ఇవ్వాలని కోరారు. ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగమివ్వాలనీ, కన్నయ్య కుమారుడి చదువుకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చైర్మెన్‌ను కలిసిన వారిలో నాయిని స్వరూప(కన్నయ్య భార్య)మరిమల మల్లీశ్వరీ, శంకరయ్య, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్‌, చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ కో-కన్వీనర్‌ పైళ్ల ఆశయ్య, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు,ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ అరుణజ్యోతి, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట రమేశ్‌, ఎ వెంకటేశ్‌, సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img