జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి యావత్ భారతావనిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. తెల్లటి మంచు కొండల్ని ఎర్రటిరక్త ప్రవాహంలో ముంచింది. పచ్చని పర్వతాల మధ్య విహరిస్తున్న పర్యాటకులపై విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో ఇరవై ఎనిమిది మంది తమ విలువైన ప్రాణాల్ని కోల్పోయారు. అయితే ఈదాడి తామే చేశామని జంకుబొంకు లేకుండా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ అనుబంధ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)’ ప్రకటించడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ‘కశ్మీర్‌లో ఇక తీవ్రవాదం అనేదే ఉండదు. ఇకనుంచి ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తారు. ఇతర ప్రాంతాల వారు పెట్టుబడుల్ని పెట్టి వ్యాపారాలు చేస్తారు. స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు బాగా మెరుగు పడతాయి’ అని ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రగల్భాలు పలికారు. మరి ఇప్పుడేమైంది? అదంతా ఉత్తదేనని తేలిపోయింది.పెద్ద పెట్టుబడులేం రాలేదు, ఉపాధి దొరకలేదు. కానీ ఉగ్రవాదం మాత్రం పెరిగింది. పైగా పుల్వామా లాంటి దాడితో పాకిస్తాన్‌తో మనదేశానికి ప్రమాదం ముంచుకొస్తుందనే పేరుతో రెండోసారి అధికారంలోకి మోడీ అధికారంలోకి వచ్చారు. అంతేకాదు, పెద్దనోట్ల రద్దు సమయంలో నల్లధనాన్ని వెలికితీస్తామని, ఉగ్రవాదులకు నిధులం దకుండా చేస్తానని, నకిలీ కరెన్సీ సమస్యను తుదముట్టిస్తామని, అవినీతిని నిర్మూలి స్తామని హామీలిచ్చారు.ఇందులో ఏ ఒక్క సమస్యకు పరిష్కారం చూపలేదు.
అవినీతి ప్రక్షాళనకు తీసుకున్న చర్యలేమీ లేవు. ఇక ఉగ్రవాదుల్ని పెంచిపోషిస్తున్నది నకిలీ కరెన్సీ అని, దాన్ని అడ్డుకోవడానికే పెద్దనోట్ల రద్దు అని చెప్పిన మోడీ దాన్ని అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ‘గుజరాత్ మోడల్’గా చెప్పబడే రాష్ట్రంలోనే నకిలీ కరెన్సీ కేసులు ఎక్కువగా నమోదవడం, అక్కడి నుంచే వివిధ రాష్ట్రాలకు నకిలీనోట్లు చేరడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దేశంలో నకిలీ నోట్ల చెలామణి అవుతుందని, రూ.500 నోట్లు ముద్రిస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని ఇటీవల కేంద్ర హోంశాఖనే హెచ్చరిక జారిచేసిన నేపథ్యంలో పెద్దనోట్లరద్దు దేనికి ఉప దేశించిందో,ఎవరి ప్రయోజనాల్ని నెరవేర్చిందో వేరే చెప్పనక్కర్లేదు! ఇది మోడీ దుర్మార్గపు, అనాలోచిత చర్యకు పరాకాష్ట తప్ప వేరేకాదు! జమ్మూకాశ్మీర్ మొదటినుంచి ప్రత్యేక రాజ్యాంగం, కొన్ని స్వయం ప్రతిపత్తి హక్కుల్ని కలిగి ఉన్నది. దానికి ఉద్దేశించబడిందే ఆర్టికల్ 370.ఎప్పటినుంచో దీన్ని రద్దు చేయాలనే ఆలోచనతో ఉన్న మోడీ సర్కార్ ఉగ్రవాదం నుంచి రక్షణ పేరుతో కశ్మీర్‌లో రాజకీయాలు చేపట్టింది.ముఫ్తీ ప్రభుత్వానికి మద్దతు ఉప సంహరించుకుని ఆరునెల్లపాటు రాష్ట్రపతి పాలన విధించింది. రాజ్యాంగ పరిమితులున్నా పార్ల మెంటులో సవరణలు చేపట్టి 2019లో దీన్ని ఏకపక్షంగా రద్దుచేసింది.జమ్మూకాశ్మీర్, లడఖ్‌లుగా కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. మాజీ ముఖ్య మంత్రులు, ప్రతిపక్ష, వామపక్ష నేతల్ని సహా అందరినీ గృహనిర్భంధం చేసింది. మరి ఇంతచేసి ఉగ్రవాదాన్ని నిరోధించగలిగిందా అంటే అదీ లేదు.
ఈ ఆరేండ్ల కాలంలో అనేక ఉగ్రదాడుల్ని కాశ్మీర్ చవిచూసింది. జైష్-ఎ-మహమ్మద్ జరిపిన దాడిలో ఇరవైఐదు మంది భారత సైనికులు చనిపోయారు. అమర్‌నాథ్‌కు వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో పదిమంది యాత్రికులు మృతిచెందారు. చిట్టిసింగ్‌పూర్‌లో ఉగ్రవాదుల చేతిలో ముప్తై ఐదు మంది సిక్కులు బలయ్యారు. ఇలా చెప్పుకుంటూపోతే అనేకం.కానీ ఇవేమీ మోడీ సర్కార్‌కు పట్టవు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో ఏరిపారేస్తామనే మోడీ,షాలు వీటికి సమాధానం చెప్పగలరా? కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థను సగం నిలబెట్టేది వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటక ఆదాయమే. సరైన భద్రతా చర్యలు కేంద్రం తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు పర్యాటక రంగం దెబ్బతిన్నది. దీనిపై ఆధారపడి జీవించే కాశ్మీరీల పరిస్థితేంటి? సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి అబ్బాస్ జమ్మూకాశ్మీర్‌లో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం లేనేలేవని, అక్కడంతా మౌనమే రాజ్యమేలుతోందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మాటమాట్లాడితే కాశ్మీర్‌లో శాంతిని నెలకొల్పామని మోడీ,షాలు చెబుతున్నారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికే అధికారం లేనప్పుడు ప్రజాసమస్యలు ఎవరు తీరుస్తారు? కేంద్ర కనుసన్నల్లో ఉన్న లెప్టినెంట్ జనరల్‌నే పాలనను నడిపిస్తూ, బదిలీలు చేస్తే ఎలా? పేరుకు మాత్రం ఎన్నికలు జరిపి, అధికార మంతా కేంద్రం చేతిలో ఉంచుకోవడం సబ బేనా? ఉగ్రదాడి నేపథ్యంలో మోడీ, అమిత్ షాలు సమీక్షలు జరుపుతూ వారిని వదిలిపెట ్టబోమని, ప్రతికారం తీర్చుకుంటామని శపథాలు చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు పరిహారాలు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు కావాల్సింది ప్రతీకారాలు, పరిహారాలు కాదు. జమ్మూకాశ్మీర్ భవిష్యత్తు, రాష్ట్ర రక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారన్నదే కీలకం.దానిపై కేంద్రం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి.
కశ్మీర్‌ను కాపాడేదెవరు?
- Advertisement -
RELATED ARTICLES