– పేదలకు పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలి
– సమస్యల పరిష్కారంలో వరంగల్ కార్పొరేషన్ విఫలం : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య
– స్థానిక సమస్యలపై హనుమకొండ కలెక్టరేట్ ఎదుట సీపీఐ(ఎం) ధర్నా
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి/వరంగల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను విస్మరించి కార్పొరేట్ శక్తులకు సంపదను దోచిపెడుతున్నాయని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య అన్నారు. హనుమకొండ జిల్లాలో స్థానిక సమస్యలపై సీపీఐ(ఎం)జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 20రోజులు సర్వే నిర్వహించారు. అందులో వచ్చిన సమస్యలపై సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆర్ట్స్, అండ్ సైన్స్ కళాశాల నుంచి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన ధర్నాలో వీరయ్య మాట్లాడుతూ.. జిల్లాలో ఇండ్లు లేని నిరుపేదలు ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు వేసుకొని ఏండ్ల తరబడి జీవనం కొనసాగిస్తున్నా పాలకులు వీరికి పట్టాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. వీరంతా ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లకు అనర్హులు కావడంతో సొంత ఇంటి కల నెరవేరే పరిస్థితి లేదన్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, కార్మికులు, రైతు కూలీలు ఎదుర్కొంటున్న ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేదని తెలిపారు. ఏడో గ్యారంటీ పేరుతో ప్రజాస్వామ్య హక్కులను కాపాడుతానని చెప్పిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. పేదలకు కనీసం తమ నిరసన తెలపడానికి కలెక్టర్ కార్యాలయం ముందు టెంట్లు వేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలిచిన బీజేపీ.. రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ విషయంలోనూ, తెలంగాణ విభజన హామీలను అమలు చేయించడంలోనూ విఫలమైందన్నారు. పేదలు వేసుకున్న ఇండ్లకు వెంటనే పట్టాలిచ్చి, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాసమస్యలను పాలక వర్గాలు విస్మరించి కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. సమస్యలను పరిష్కరించడంలో వరంగల్ కార్పొరేషన్ విఫలమైందన్నారు. సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా కార్యదర్శి జి.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సమ్మయ్యనగర్, ఇంజినీరింగ్ కాలనీ, జ్యోతిబసు నగర్ పేస్ 1,2, కోమళ్ల కుంట, సుర్జిత్ నగర్, జ్యోతిరావుపూలే నగర్, ఎంఎన్ నగర్, పలివేల్పుల, భగత్‌సింగ్ నగర్, ప్రగతినగర్, నాగేంద్రనగర్ తదితర కాలనీల్లో ఏండ్ల తరబడి నివాసముంటూ కరెంటు బిల్లులు, మున్సిపల్ ట్యాక్స్‌లు చెల్లిస్తున్నారని, కానీ నేటికీ వారికి పట్టాలివ్వలేదని అన్నారు. ఇండ్లు లేని నిరుపేదలు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో గుడిసెలు వేసుకొని ఉంటున్నారని, వారందరికీ పట్టాలిచ్చి, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. అంబేద్కర్ నగర్, శాయంపేటలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను నేటికీ పంపిణీ చేయకపోవడంతో అవి శిథిలమవుతున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎం.చుక్కయ్య, బొట్ల చక్రపాణి, రాగుల రమేష్, గొడుగు వెంకట్, వాంకుడోతు వీరన్న, జి.రాములు, డి.తిరుపతి, కె.లింగయ్య, డి.భాను నాయక్, మండల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్లకు దోచిపెడుతున్న పాలకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES