Wednesday, April 30, 2025
Homeతాజా వార్తలుకార్మికవర్గంపై బీజేపీ కుట్రలు

కార్మికవర్గంపై బీజేపీ కుట్రలు

– రాజకీయాలకతీతంగా కార్మికులు పోరాడాలి : జె.వెంకటేశ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కార్మికవర్గంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదనీ, లేబర్‌కోడ్‌లతో హక్కులను హరిస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో కార్మికులు రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకంగా ఐక్య పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయ సాధన పోరాటాలకు సంఘీభావంగా గురువారం హైదరాబాద్‌లోని ప్రభుత్వ పుస్తకాల ముద్రణాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో సంఘీభావ నిధి చేపట్టారు. ఆ కార్యక్రమంలో నాయకులు ఆర్‌. ఈశ్వర్‌బాబు, బి.శ్రీనివాస్‌, రాములు, మల్లేష్‌, ఎం. శ్రీరామ్‌, ఆర్‌ఎస్‌. వాసు, ఎమ్‌డీ.ఇఫ్తికార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జె. వెంకటేష్‌ మాట్లాడుతూ..దేశంలో సామాజిక అణచివేత, అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నాయనీ, ఈ నేపథ్యంలో కార్మికవర్గం కార్మిక హక్కులను కాపాడటంతో పాటు సామాజిక అంతరాలను తగ్గించేందుకు సీఐటీయూ కృషి చేస్తున్నదన్నారు. కేంద్రంలో 11 ఏండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగం, నిరక్షరాస్యత, పేదరికం, అధిక ధరలు, ఉద్యోగ కల్పన వంటి విషయాల్లో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వ రంగం బలహీనపర్చటం, సంక్షేమ చర్యల నుంచి వైదొలగడం వంటి కార్మిక, ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకే కుల, మత, ప్రాంతీయ అసమానతలను పెంచి పోషిస్తున్నదని విమర్శించారు. కార్మికవర్గం ఈ ప్రమాదాన్ని గుర్తించాలని కోరారు. మనువాద సిద్ధాంతంతో భారత రాజ్యాంగాన్ని బలహీనపరుస్తున్న బీజేపీ కుట్రలకు వ్యతిరేకంగా కార్మికవర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img