Tuesday, April 29, 2025
Homeతాజా వార్తలుదేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి

దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి

– ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్లను కాపాడాలి
– హెచ్‌సీయూ, ఫార్మా, రామోజీ భూములపై ముఖ్యమంత్రి స్పందించాలి
– సూర్యాపేటలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ-సూర్యాపేట
దేశంలో శ్రామిక వర్గ రాజ్యస్థాపనే లక్ష్యంగా సీపీఐ(ఎం) పనిచేస్తోందని, సామాజిక న్యాయ పోరాటాలు బలోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 11 నుంచి 14 వరకు సామాజిక అధ్యయన యాత్రలు చేపడుతున్నామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మత, కుల ఘర్షణలు, మహిళలపై దాడులు పెరిగిపోయాయన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని, మనువాద, కార్పొరేట్‌ విధానాలను అనుకూలంగా బీజేపీ పని చేస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్‌ అమలు చేసేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినా.. దానిపై కేంద్రం పెదవి ఇప్పడం లేదన్నారు. కేంద్ర మంత్రులు బండి సంజరు, కిషన్‌రెడ్డి ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి ప్రజలపై పెను భారాలు మోపారన్నారు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లను నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నారని, వాటిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఒక్క రైల్వేలోనే 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయాలన్నారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ భూముల అమ్మకాల విషయంలో బీజేపీ ఎంపీల పాత్ర ఉందని వార్తలు వస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని అన్నారు. ఫార్మా భూములకు సంబ ంధించి ప్రతి రైతుకూ 120 గుంటల భూమి, ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీని, 2013 చట్ట ప్రకారం నష్టపరిహారం అందించిన తర్వాతే ముందుకు పోవాలని సూచించారు. హెచ్‌సీ యూ, ఫార్మా, రామోజీ భూముల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పందించాలని డిమాండ్‌ చేశారు. విలేకరుల సమావేశానికి ముందు పట్టణం లో మహాత్మ జ్యోతిబాయి ఫూలే విగ్రహానికి జాన్‌వెస్లీ తో పాటు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మీ పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యు లు కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నాగారపు పాండు, చెరుకు ఏకలక్ష్మి, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి, ధనియాకుల శ్రీకాంత్‌ వర్మ, పులుసు సత్యం, నాయకులు వట్టెపు సైదులు, పోషణ బోయిన హుస్సేన్‌, వజ్జె శ్రీను, యాదగిరి, చినపంగి నరసయ్య, శ్రీరాములు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img