Monday, May 5, 2025
Homeజాతీయంకేంద్రం భద్రతా లోపంపై జర్నలిస్ట్‌ ప్రశ్న

కేంద్రం భద్రతా లోపంపై జర్నలిస్ట్‌ ప్రశ్న

- Advertisement -

– బీజేపీ కార్యకర్తల దాడి
– సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌
న్యూఢిల్లీ:
పహల్గాం ఉగ్రదాడి విషయంలో వచ్చే పలు అనుమానాలు, ప్రశ్నలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు సహించలేకపోతున్నారు. ఈ విషయంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగోస్తంభంగా చెప్పబడే మీడియానూ టార్గెట్‌ చేసుకుంటున్నారు. పహల్గాం ఘటన విషయంలో భద్రతా వైఫల్యంపై ప్రశ్నలు సంధించిన జర్నలిస్టులపై దాడికి దిగుతున్నారు. జమ్మూకాశ్మీర్‌లోని కథువా జిల్లాలో బీజేపీ నిరసనను కవర్‌ చేస్తున్న ఒక జర్నలిస్టుపై ఈ విధమైన దాడి చోటు చేసుకోవటం గమనార్హం. ఈ ఘటనను జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. వివరాళ్లోకెళ్తే.. పహల్గామ్‌ ఉగ్రదాడిపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. బీజేపీ శాసనసభ్యులు దేవిందర్‌ మాన్యాల్‌, రాజీవ్‌ జస్రోటియా, భరత్‌ భూషణ్‌లు కూడా ఈ ఆందోళన కార్యక్రమానికి హాజరయ్యారు. వీరి నిరసనను కవర్‌ చేయటానికి జర్నలిస్టులు వెళ్లారు. ముష్కరుల దాడికి దారి తీసిన భద్రతా లోపాల గురించి బాధిత జర్నలిస్టు రాకేశ్‌ శర్మతో పాటు ఇతర జర్నలిస్టులు కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ఇలా అడగటాన్ని జీర్ణించుకోలేని పార్టీ ఎమ్మెల్యేలు సహా నిరసనకారులు మీడియాపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జర్నలిస్టులు వేర్పాటువాద భాషను మాట్లాడుతున్నారని బీజేపీ సభ్యుడు హిమాన్షు శర్మ ఆరోపించారు. ఇలా జర్నలిస్టులను పదే పదే అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనిపై జర్నలిస్టులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆగ్రహానికి గురైన బీజేపీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం వద్దే జర్నలిస్ట్‌ రాకేశ్‌ శర్మపై దాడి చేయటం గమనార్హం. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ దాడి నుంచి డీఎస్పీ రవీందర్‌ సింగ్‌ తనను కాపాడారనీ, ఆ తర్వాత ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారని బాధితుడు రాకేశ్‌ శర్మ తెలిపారు. దాడి చేసిన నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలని కోరుతూ కథువా పోలీసు అధికారి శోభిత్‌ సక్సేనాను జర్నలిస్టులు కలిశారు. కథువాలోని షాహీదీ చౌక్‌, జమ్మూలోని ప్రెస్‌క్లబ్‌ వద్ద కూడా జర్నలిస్టులు తమ నిరసనను తెలియజేశారు. నిందితులపై బీజేపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అప్పటి వరకూ బీజేపీ కార్యక్రమాలన్నింటినీ బహిష్కరిస్తామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -