నవతెలంగాణ-హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలను కోల్పోయారు. దీనిపై కేరళ సిఎం పినరయి విజయన్ విచారాన్ని వ్యక్తం చేశారు. అక్కడ ఎర్నాంకులమ్‌కు చెందిన వ్యక్తి కూడా మరణించారు. జమ్మూ కాశ్మీర్‌కు వెళ్లిన కేరళ హైకోర్టు న్యాయవాదులు, ఎమ్మెల్యేలు తృటిలో తప్పించుకున్నారు. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ఈ వివరాలు వెల్లడించింది. ” జమ్మూ కాశ్మీర్ పర్యటనకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ కే నరేంద్రన్, జస్టిస్ పీజీ అజిత్ కుమార్, జస్టిస్ జి.గిరీష్.. ఎమ్మెల్యేలు ముకేశ్, కేపీఏ మజీద్, టి. సిద్ధిక్, కె.అన్నాలన్ వెళ్లారు. ఉగ్రవాదుల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ప్రస్తుతం శ్రీనగర్‌లో ఉన్నారు. వీరంతా సురక్షితంగా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో చిక్కుకున్న ప్రజలను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ” అని వెల్లడించింది. ఈ ఘటనపై సిఎం పినరయి విజయన్ విచారం వ్యక్తం చేశారు. ” ఎర్నాంకులమ్‌కు చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. అతడి కుటుంబసభ్యులను జాగ్రత్తగా ఇంటికి చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తాం ” అని ముఖ్యమంత్రి తెలిపారు” అని సీఎంవో పేర్కొంది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో కొచ్చిలోని ఎడపల్లికి చెందిన ఎన్. రామచంద్రన్ ప్రాణాలు కోల్పోయారు. కాగా.. పహల్గాం సమీప బైసరన్ లోయలో సైనికుల దుస్తుల్లో వచ్చిన అయిదుగురు ముష్కరులు పురుషులే లక్ష్యంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో 28 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
కేరళ సిఎం పినరయి విజయన్ విచారం
- Advertisement -