Wednesday, April 30, 2025
Homeతాజా వార్తలుకొత్త ఆవిష్కరణలకు కట్టుబడి ఉన్నాం

కొత్త ఆవిష్కరణలకు కట్టుబడి ఉన్నాం

– సుస్థిర విధానాలు, శాంతియుత వాతావరణాన్ని కల్పిస్తాం
– ప్రిఫెక్చరల్‌ అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడిన రేవంత్‌రెడ్డి
– హిరోషిమాను సందర్శించిన సీఎం బృందం
– పరస్పర సహకారంపై డిప్యూటీ గవర్నర్‌తో చర్చలు
– మహాత్మాగాంధీకి నివాళులు
– ముగిసిన ఏడురోజుల సీఎం బృందం పర్యటన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కొత్త ఆవిష్కరణలు, సుస్థిర విధానాలు, శాంతియుత వాతావరణానికి తెలంగాణ కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శాంతి, సాంకేతిక పురోగతిలో హిరోషిమా ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించిందని కొనియాడారు. జపాన్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌ బృందం మంగళవారం ఒసాకా నుంచి హిరోషిమాకు చేరుకుంది. అక్కడి పీస్‌ మెమోరియల్‌ సందర్శించి గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించింది. అనంతరం స్థానిక డిప్యూటీ గవర్నర్‌తో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా తెలంగాణ, హిరోషిమా కలిసి పని చేయగలిగే రంగాలపై విస్తృతంగా చర్చలు జరిపింది. వ్యర్థాల నుంచి ఇంధనం తయారు చేసే క్లీన్‌ టెక్నాలజీ, మురుగు నీటి శుద్ధి, పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులు, అర్బన్‌ ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, విపత్తుల నివారణ డిజైన్లు, భూగర్భ మెట్రో ఇంజినీరింగ్‌, స్మార్ట్‌ సిటీ సొల్యూషన్స్‌, పారిశ్రామిక సహకారం, ఎలక్ట్రిక్‌, ఎలక్ట్రానిక్స్‌, అధునాతన ఉత్పత్తుల తయారీకి హిరోషిమా-తెలంగాణ ఆటోమోటివ్‌ అండ్‌ మొబిలిటీ కారిడార్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలపై చర్చించింది. విద్య, సాంస్కృతిక మార్పిడి, హిరోషిమా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీతో తెలంగాణలోని విశ్వవిద్యాలయాల మధ్య సంబంధాలు, పరిశోధనలకు సహకారంపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వారికి వివరించారు. అనంతరం సీఎం బృందం హిరోషిమా ప్రిఫెక్చర్‌ను సందర్శించింది. స్థానిక అసెంబ్లీని ఉద్దేశించి ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు. ”హిరోషిమా అంటే శాంతికి చిహ్నం. అణుబాంబుల విధ్వంసాన్ని తట్టుకుని గొప్పనగరంగా ఎదిగింది. ప్రజలు కలిసికట్టుగా పనిచేస్తే ఏదైనా సాధ్యమని ప్రపంచానికి నిరూపించింది. హిరోషిమా మాదిరిగానే ప్రజల ఆశలు, ఆకాంక్షలు, పోరాటానికి చిహ్నం తెలంగాణ. దూరదృష్టితో అన్ని రంగాల్లో విజయం సాధించిన రాష్ట్రం’ అని సీఎం పేర్కొన్నారు. ఇప్పటికే యాభైకి పైగా జపాన్‌ కంపెనీలు తెలంగాణలో అద్భుతంగా పనిచేస్తున్నాయనీ, మరిన్ని కంపెనీలు తమతో భాగస్వామ్యం పంచుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణను సందర్శించి, రాష్ట్ర ప్రగతిని స్వయంగా చూడాలని హిరోషిమా ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానించారు.
తెలంగాణ దేశానికి గేట్‌వేగా.. ప్రపంచానికి విస్తరించే వేదికగా ఉంటుందని అన్నారు. హిరోషిమా-హైదరాబాద్‌, జపాన్‌-తెలంగాణ మధ్య బలమైన సంబంధాల వారధిని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ ప్రతినిధి బృందం హిరోషిమా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నాయకులతో సమావేశమై వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఇరు ప్రాంతాల మద్య సహకారంపై చర్చించింది. అనంతరం హిరోషిమా శాంతి స్మారక వనంలో బాంబు దాడిలో అసువులు బాసిన వారికి నివాళులర్పించింది. 1945లో దాడి తర్వాత నగరంలో నిలిచి ఉన్న ఏకైక నిర్మాణం అణు బాంబు డోమ్‌ను సందర్శించి స్థానిక అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంది. దీంతో సీఎం రేవంత్‌ బృందం ఏడు రోజుల పర్యటన ముగిసింది. మంగళవారం రాత్రి ఒసాకాలోని కాన్సారు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి బయల్దేరి బుధవారం ఉదయానికి హైదరాబాద్‌కు చేరుకుంటుంది.
రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు రూ.12,062 కోట్లు
– 30,500 మందికి ఉపాధి అవకాశాలు
– జపాన్‌ పర్యటనలో సీఎం బృందం ఒప్పందాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఏడు రోజుల జపాన్‌లో పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం రూ.12,062 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 30,500 ఉపాధి అవకాశాలు లభించనున్నాయని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. అలాగే రాష్ట్రానికి చెందిన టామ్‌ కామ్‌ సంస్థతో కలిసి టెర్న్‌, రాజ్‌ గ్రూప్‌ కంపెనీలు జపాన్‌లో 500 ఉద్యోగ నియామకాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని పేర్కొన్నారు.
క్ర.సం కంపెనీ పేరు పెట్టుబడి (కోట్లల్లో) ఏర్పాటు చేసే రంగం
1) మారుబెని 1,000 ఫ్యూచర్‌ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్‌ ఇండిస్టియల్‌ పార్క్‌
2) ఎన్‌టీటీడేటా, నెయిసా 10,500 అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ డేటా సెంటర్‌ క్లస్టర్‌
3). టీటీడీఐ కంపెనీ 532 విద్యుత్‌ పరికరాలు, సామాగ్రి తయారీ
జయ జయ తెలంగాణ గీతాన్ని ఆలపించిన చిన్నారులు
హిరోషిమాలోని గాంధీ స్మారక చిహ్నం వద్ద ఇద్దరు పాఠశాల విద్యార్థులు బేబీ హాసిని (8వ తరగతి), బేబీ హరిని (7వ తరగతి) ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బృందాన్ని కలిసి వారి చిత్రాలను ప్రదర్శించారు. అనంతరం వారు ”జై జై హే తెలంగాణ” అనే తెలంగాణ గీతాన్ని ఆలపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img