Monday, May 5, 2025
Homeజాతీయంచెలామణిలో నకిలీనోట్లు

చెలామణిలో నకిలీనోట్లు

- Advertisement -

– నోట్ల రద్దు సమయంలో ఇలాంటి నోట్లు కనబడవన్న మోడీ సర్కార్‌
– ఇప్పుడు రూ. 500 నోట్లపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హౌంశాఖ హెచ్చరిక
– గుజరాత్‌ నుంచే అత్యధికంగా దొంగనోట్ల ముద్రణ
– నోట్ల రద్దుకు పదేండ్లు కావస్తున్నా తప్పని కష్టాలు
దేశంలో నకిలీ కరెన్సీ మళ్లీ కలకలం సృష్టిస్తున్నది. ఆనాడు అదరాబాదరాగా చేసిన నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రతిపక్షాలు, ప్రజలు తప్పుబట్టారు. కానీ మోడీ సర్కార్‌ వినలేదు. పైగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని పెద్దనోట్లను తెస్తున్నామని, ఇది బ్లాక్‌మనీని, నకిలీ కరెన్సీని అరికడుతుందని ప్రకటించింది. ఇపుడు రూ. 500 నోట్లు నకిలీవి వస్తున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేంద్రహౌంశాఖ హెచ్చరిక చేస్తోంది. అంటే నకిలీ కరెన్సీని అడ్డుకోలేని కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
న్యూఢిల్లీ: దేశంలో నకిలీ నగదు చెలామణిలో ఉన్నదన్న విషయం ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యంగా, గుజరాత్‌లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. నవంబర్‌ 8, 2016న కేంద్రంలోని మోడీ సర్కారు పెద్ద నోట్ల రద్దును అమలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా, నల్లధనం, నకిలీ కరెన్సీ, అవినీతి అంతమే లక్ష్యంగా మోడీ సర్కారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. కానీ ఈ నిర్ణయం మోడీ చెప్పినట్టుగా అనుకున్న లక్ష్యాలు సాధించకపోగా.. ప్రజలను తీవ్ర కష్టాల్లోకి నెట్టేసింది. ఆ సమయంలో ఏటీఎంల ముందు క్యూలైన్లలో నిలబడి జనం ప్రాణాలు సైతం కోల్పోయారు.పెద్ద నోట్ల రద్దు విషయంలో మోడీ సర్కారు నిర్ణయం దేశప్రజలను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. ఉన్నట్టుండి ఆయన నుంచి ఈ ప్రకటన రావటం ఆ సమయంలో ఆర్థిక నిపుణులను విస్మయానికి గురి చేసింది. పెద్ద నోట్ల రద్దుపై మోడీ తన టెలివిజన్‌ ప్రసంగంలో ప్రకటన చేశారు. ”అవినీతి, నల్లధనం, నకిలీ నోట్లు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో, మన దేశాన్ని శుద్ధి చేసే ఈ ఉద్యమంలో, మన ప్రజలు కొన్ని రోజులు కష్టాలను భరించలేరా? ప్రతి పౌరుడూ నిలబడి ఈ ‘మహాయజ్ఞం’లో పాల్గొంటారని నాకు పూర్తి నమ్మకం ఉంది” అని అన్నారు.
ఆయన చెప్పినట్టుగా అవినీతి కానీ, నల్లధనం కానీ అంతం కాలేదన్నది అనుభవం చెబుతున్న సత్యం. ఒకవేళ కేంద్రం చెప్పినట్టుగానే జరిగి ఉంటే.. వీటిపై స్పష్టమైన గణాంకాలను విడుదల చేసి ఉండేదని విశ్లేషకులు అంటున్నారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించని కారణంగానే బీజేపీ సర్కారు అలాంటి సాహసం చేయలేదని చెప్తున్నారు. నల్లధనానికి పెద్దనోట్లు కీలకంగా మారాయని చెప్పిన మోడీ సర్కారు.. నోట్ల రద్దు తర్వాత రెండువేల రూపాయల నోటును తీసుకురావటానికి గల కారణాన్ని వారు ప్రశ్నించారు. ఇంతలో ‘పెద్దోళ్ల లెక్కలు తేలాయోమో?’ అని వారు అనుమానాలను వ్యక్తం చేశారు. డీమానిటైజేషన్‌ తర్వాత లెక్కకు రాని సంపదను మోడీ సర్కారు తొలగిస్తుందని అంతా భావించారు. కానీ, మోడీ సర్కారు అలా చేయలేదు. 2017లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ లెక్కల్లో లేని సంపద పెద్ద ఎత్తున డిపాజిట్‌ కాలేదని చెప్పారు. ఆ తర్వాత ఏడాది..రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) కూడా ఇదే విషయాన్ని చెప్పింది. దాదాపు 99.3 శాతం రద్దు చేయబడిన కరెన్సీ బ్యాంకులకు తిరిగి వచ్చిందని వివరించింది.
నకిలీ కరెన్సీ, ఇతర అసలు లక్ష్యాల సంగతేంటి?
కేంద్రంలోని మోడీ సర్కారు 2016లో నోట్ల రద్దు కోసం కొన్ని ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకున్నది. ప్రధాని మోడీ కూడా తన ప్రసంగంలో దీనినే నొక్కి చెప్పారు. అవినీతి, నల్లధనం అంతం ముచ్చట్లు చెప్పినా.. అవి వాస్తవరూపం దాల్చలేదన్నది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నకిలీ కరెన్సీ చెలామణీని తగ్గిస్తామని చెప్పినా.. అలా జరగలేదని గణాంకాలు చెప్తున్నాయి.
ఏటికేడూ పెరిగిన ఫేక్‌ కరెన్సీ జప్తు
2016లో రూ. 15.92 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ జప్తు జరిగింది. తర్వాతి సంవత్సరాల్లో ఇవి గణనీయంగా పెరిగాయి. వీటి విలువ 2017లో రూ.28.10 కోట్లు, 2018లో రూ.17.95 కోట్లు, 2019లో రూ.25.39 కోట్లు, 2020లో రూ.92.17 కోట్లు, 2021లో రూ.20.39 కోట్లుగా నమోదయింది. 2021 తరువాత సంవత్సరాల గణాంకాల ప్రకారం వరుసగా రూ. 28.10 కోట్లు, రూ. 17.95 కోట్లు, రూ. 25.39 కోట్లు, రూ. 92.17 కోట్లు, రూ. 20.39 కోట్లుగా ఉంది. వాస్తవానికి.. 2015లో నోట్ల రద్దుకు ముందు రూ.15.48 కోట్ల నకిలీ కరెన్సీ మాత్రమే స్వాధీనం కావటం గమనార్హం.
అప్రమత్తంగా ఉండండి రూ.500 నోట్లతో జాగ్రత్త : కేంద్ర హౌంశాఖ హెచ్చరికలు
భారత్‌లో నకిలీ నోట్ల కలకలం ఆందోళన కలిగిస్తున్నది. కేంద్రం హౌంశాఖ హెచ్చరికే దీనిని స్పష్టం చేస్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజీ వాడి తయారుచేసిన రూ.500 దొంగనోట్లు చెలామణీలోకి వచ్చినట్టు కేంద్ర హౌంశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని వివరించింది. ఈ సమాచారాన్ని డీఆర్‌ఐ, ఎఫ్‌ఐయూ, సీబీఐ, ఎన్‌ఐఏ, సెబీతో కూడా పంచుకున్నది. ఆ దొంగనోట్ల ప్రింటింగ్‌, నాణ్యత చాలావరకు అసలు నోట్లలాగే ఉన్నట్టు వెల్లడించింది. వాటిని గుర్తించడం కూడా చాలా క్లిష్టంగా మారిందని వివరించింది. ఈ నోట్లలో ఒక చిన్న స్పెల్లింగ్‌ తప్పు ఉన్నదని పేర్కొన్నది. దీనిని గుర్తించడంలో అదే కీలకమని వివరించింది. ‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’లో ‘ఈ’కి బదులు ‘ఏ’ పడినట్టు పేర్కొన్నది. ఈ చిన్న తప్పును గుర్తించాలంటే ఆ నోటును క్షుణ్ణంగా పరీక్షించాల్సి ఉంటుందని వివరించింది. ఇలాంటి నకిలీ నోట్లు అత్యంత ప్రమాదకరమని వెల్లడించింది. వీటి విషయంలో ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ఏజెన్సీలను అప్రమత్తంగా ఉంచినట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇవి మార్కెట్లో ఉన్నాయని హెచ్చరించారు.
ఆందోళన కలిగిస్తున్న నకిలీ నోట్లు
నిజానికి పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో నకిలీ నోట్ల కలకలం పెరిగింది. మరీ ముఖ్యంగా.. దాదాపు ఆరేడేండ్ల తర్వాత.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో నకిలీ రూ. 500 నోటు చెలామణీ పెరుగుదలను చూసింది. 14.4 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఆర్బీఐ ఈ సమాచారాన్ని వెల్లడించింది. ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం.. బ్యాంకింగ్‌ వ్యవస్థలో 91,110 నకిలీ రూ. 500 నోట్లు వచ్చి చేరాయి. అంటే, వాటి విలువ రూ. 4.55 కోట్లు అన్నమాట. ఇది గత సంవత్సరం గణాంకాల కంటే పెరుగుదలను నమోదు చేయటం గమనార్హం. గతేడాది మొత్తం రూ. 3.98 కోట్లు విలువ ఉన్న 79,669 నకిలీ నోట్లు కనుగొనబడ్డాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -