– నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీల నిర్వహణ
– అక్రమంగా మట్టి, బొగ్గు వినియోగం
– రూ. వందల కోట్ల రాయల్టీ ఎగవేత
– రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ శాఖల పర్యవేక్షణ కరువు
రాష్ట్రంలో ఇటుక బట్టీలు అక్రమ వ్యాపారాలకు నిలయంగా మారాయి. నిబంధనలకు తూట్లు పొడిచి యథేచ్ఛగా జీరో దందా కొనసాగిస్తున్నాయి. ఇటుకల తయారీకి వాడే ప్రధాన ముడిసరుకైన మట్టి నుంచి మొదలుకుని బొగ్గు, ఊక, బూడిద, కట్టెలను అక్రమంగా తరలిస్తున్నారు. 20 నుంచి 30శాతం వరకు మాత్రమే అనుమతి పొంది మిగతా ముడి సరుకుకు ఎలాంటి రాయల్టీ చెల్లించడం లేదు. ఈ చైన్ సిస్టమ్‌లో మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ తదితర ప్రభుత్వ శాఖలతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధుల హస్తం ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు స్వీయ లాభాలకు ఆశపడి బట్టీల అక్రమ దందాల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఫలితంగా ప్రభుత్వం కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ఇటుక బట్టీల రంగం ఏటా వేల కోట్ల రూపా యల వ్యాపారం సాగిస్తూ… వందల కోట్ల లాభాలను ఆర్జిస్తోంది. యాజ మాన్యాలు మాత్రం ప్రభుత్వానికి పన్నులను సక్రమంగా చెల్లించడం లేదు. బట్టీ ఏర్పాటు చేసేందుకు సంబంధిత గ్రామ పంచాయతీ అనుమతి పొందాలి. గ్రామాభివృద్ధికి వారి టర్నోవర్‌లో 2 శాతం పన్ను రూపంలో చెల్లించాలి. ఇది రాష్ట్రంలో ఎక్కడా అమలు కావడం లేదు. గ్రామానికి చెందిన ప్రజా ప్రతినిధులు, ఇతర నేతలకు ఎంతో కొంత ముట్టజెప్పి పని కానిస్తున్నారని వినికిడి. ఇటుక అమ్మకాలకు సంబంధించి కొనుగోలుదారులకు రశీదు ఇవ్వ కుండా వాణిజ్య పన్నుల శాఖకు చెల్లించాల్సిన పన్నులను ఎగ్గొడు తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర కార్పొరేట్ సంస్ధలకు ఇటుకలను సరఫరా చేసిన సందర్భంలో మాత్రమే మొక్క బడిగా రశీదులు ఇస్తున్నారు. బట్టీల్లో విద్యుత్ చౌర్యం సైతం యథేచ్ఛగా సాగుతోంది. విద్యుత్ శాఖ అనుమతితో ఒకటి రెండు మీటర్లను నామ మాత్రంగా తీసుకుంటారు. మిగతా విద్యుత్‌ను నేరుగా వాడుకుంటు న్నారనే ఆరోపణలు న్నాయి. ఇటుక తయారు చేసే ప్రాంతంతో పాటు కార్మికుల ఆవాసాలకు తాత్కాలికంగా కొయ్యలు పాతి ప్రమాదకర మైన పరిస్థితుల్లో విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. ఫలి 78తంగా ఏటా పదుల సంఖ్యలో కార్మికులు మరణిస్తున్నారు. ఇందుకు సంబంధించి గత పదేండ్లలో పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాల్లో అనేక కేసులు నమోదయ్యాయి.
వాల్టా చట్టానికి తూట్లు…..
భూ పరిరక్షణ చట్టం 129/12లో పేర్కొన్నట్టుగా వ్యవసాయానికి పనికి రాని భూముల్లో మాత్రమే ఇటుక బట్టీల వ్యాపారం నిర్వహించాలి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా పంటలు పండే భూముల్లో ఇటుకలు తయారు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇటుక బట్టీలు నిర్వహించాలంటే ముందుగా గ్రామ పంచాయితీతో పాటు భూగర్భగనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు తీసుకోవాలి. నివాస ప్రాంతానికి కనీసం 5 కిలోమీటర్ల దూరం, పంట పొలాలకు 500 మీటర్లు, ప్రధాన రహదారికి 200 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలి. కానీ బట్టీల్లో ఆ నిబంధనలు మచ్చుకు కూడా కనిపించవు. రహదారి పక్కనే ఇటుకబట్టీలు ఉండడంతో వాటికి వినియోగించే బూడిద, బొగ్గు, ఊక పదార్థాలతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. వాటి నుంచి వచ్చే దుమ్మూ, ధూళీతో రహదారిపై వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కుతూ చెరువులు, వాగులు, ప్రభుత్వ స్థలాల నుంచి ఇటుకలకు అవసరమైన మట్టిని సేకరిస్తున్నారు.
రాయల్టీ నామమాత్రం
ప్రభుత్వానికి నామమాత్రం రాయల్టీ చెల్లిస్తున్నారు. గతంలో క్యూబిక్ మీటర్ చొప్పున చెల్లించాల్సి ఉండగా, 2022లో ఈ నిబంధనను మెట్రిక్ టన్నులకు మారుస్తూ భూగర్భగనుల శాఖ ధరలను రివైజ్ చేసింది. సినరేజీ చార్జీలు రూ.20, ఆదాయం పన్ను 40 పైసలు, జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్టుకు రూ.6, రాష్ట్ర మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్టుకు 40 పైసలు, పర్మిట్ చార్జీలు రూ.16 చొప్పున మెట్రిక్ టన్నుకు రూ. 42.80 చెల్లించాల్సి ఉంది. అయితే స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు, నేతలు సిండికేట్‌గా మారి నామమాత్రం అనుమతులు తీసుకుని అక్రమంగా మట్టిని బట్టీలకు తరలిస్తున్నారు. బొగ్గును సైతం సింగరేణి లైసెన్స్‌డ్ కాంట్రాక్టర్ల నుంచి ఇదే పద్ధతిలో సేకరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అనుమతులు లేకుండా కట్టెలను సేకరించి ఇటుకలను కాల్చడానికి వినియోగిస్తున్నారు. పౌర సమాజం నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు, లేదా బట్లీల్లో ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేపడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివిధ వర్గాల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు బట్టీల నిర్వాహకులకు చిన్నపాటి జరిమానాలు విధించి ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో జీరో దందా యథేచ్ఛగా కొనసాగుతోంది.
జీరో దందా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES