– భారత వృద్ధి అర శాతం తగ్గొచ్చు
– ఆర్థిక కార్యదర్శి అంచనా
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ ప్రకటించిన హెచ్చు టారిఫ్‌లు భారత వృద్ధిని దెబ్బతీయనున్నాయని ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ సేత్ అన్నారు. సుంకాల వల్ల భారత జీడీపీ 0.2 శాతం నుంచి 0.5 శాతం మేర తగ్గే అవకాశం ఉందని విశ్లేషించారు. వాషింగ్టన్‌లో జరుగుతున్న ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్)ల సంయుక్త సమావేశం అనంతరం అజరు సేత్ మాట్లాడుతూ.. జీడీపీ తగ్గుదలకు స్పష్టమైన సంకేతాలు కనబడుతున్నాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.5 శాతానికి పరిమితం కావొచ్చన్నారు. వాణిజ్య సంక్షోభం ప్రపంచం వృద్ధిని మందగించేలా చేస్తోన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వచ్చే దశాబ్ద కాలంలో భారత్ సగటున 7 శాతం వృద్ధి సాధించవచ్చన్నారు. ఇందుకోసం ఆర్థిక వ్యవస్థను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికాతో వాణిజ్య చర్చలు జరపడానికి భారత ప్రతినిధి బృందం వాషింగ్టన్‌లో ఉందన్నారు. దేశంలో మూలధన వ్యయాల తగ్గుదలకు తోడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో బలహీనత, అమెరికా విధాన అనిశ్చితి నేపథ్యంలో భారత జీడీపీ 0.4 శాతం తగ్గి 6.3 శాతానికి పరిమితం కావొచ్చని ఇటీవలే ప్రపంచ బ్యాంక్ విశ్లేషించింది. ఇంతక్రితం ఈ అంచనా 6.7 శాతంగా ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) కూడా భారత జీడీపీ 6.2 శాతానికి పరిమితం కావొచ్చని అంచనా వేసింది. ఇంతక్రితం 6.5 శాతం అంచనాతో పోల్చితే 0.3 శాతం తగ్గనుందని ఐఎంఎఫ్ పేర్కొంది.
టారిఫ్‌లతో జీడీపీకి దెబ్బ
- Advertisement -
- Advertisement -