No menu items!
Sunday, August 24, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeజాతీయంతమిళనాడు తీర్పు కేరళకు వర్తించదు

తమిళనాడు తీర్పు కేరళకు వర్తించదు

- Advertisement -

– సుప్రీంకోర్టులో కేంద్రం వెల్లడి
– మే 6న సవివరమైన విచారణకు ఆదేశాలు
న్యూఢిల్లీ:
పెండింగ్‌లో వున్న రాష్ట్ర బిల్లులపై మూడు మాసాల్లోగా గవర్నర్లు, భారత రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటూ తమిళనాడు దాఖలు చేసిన కేసులో ఈ నెల 8న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పొరుగు రాష్ట్రమైన కేరళకు వర్తించదని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాలు మంగళవారం జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహా, జస్టిస్‌ జోమాల్యా బగ్చిలతో కూడిన సుప్రీం బెంచ్‌కు తెలియచేశారు. తమిళనాడు అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపిన 10 బిల్లులకు తన ఆమోదాన్ని తెలియచేయడంలో గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి వల్ల కలిగిన ఆలస్యంపై ప్రభుత్వం వేసిన కేసులోని అంశాలు, వాస్తవాలు కేరళకు వర్తించవని వారు పేర్కొన్నారు. ఆ తీర్పును ప్రభుత్వం ఇంకా అధ్యయనం చేస్తోందని అంటూ మెహతా వాయిదాను కోరారు. ఈ రెండు రాష్ట్రాల కేసుల్లోని తేడా ‘ముఖ్యంగా వాస్తవాల్లోనే’ వుందని వెంకటరమణి పేర్కొన్నారు.
దీనిపై సీనియర్‌ న్యాయవాది కె.కె.వేణుగోపాల్‌, న్యాయవాది సి.కె.శశిలు మాట్లాడుతూ, ఏప్రిల్‌ 8నాటి తీర్పు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుందని చెప్పారు. కేరళ గవర్నర్‌ సుప్రీం కోర్టు విధించిన గడువుకు కట్టుబడి వున్నారా లేదా అనేది మాత్రమే కేంద్రం కోర్టులో చెప్పాల్సి వుంటుందన్నారు. దీనిపై సవివరమైన విచారణను మే 6వ తేదీన జరుపుతామని జస్టిస్‌ నరసింహా ప్రకటించారు. మొత్తంగా ఈ అంశాన్ని ముఖ్యంగా తమిళనాడు గవర్నర్‌ కేసులోని తీర్పు కేరళకు వర్తిస్తుందా లేదా అనే విషయాన్ని కోర్టు పరిశీలస్తుందని చెప్పారు. తీర్పు సందర్భంగా సుప్రీం కోర్టు ప్రకటించిన అంశాలకు కట్టుబడి వుండాల్సిందేనని రాజ్యాంగంలోని 141 అధికరణ పేర్కొంటోంది.
ఇక్కడ గవర్నర్‌పై కేరళకు సంబంధించిన కేసు రెండేళ్ళ నాటిది. 2023 నవంబరు 20న జరిగిన విచారణలో వేణుగోపాల్‌ మాట్లాడుతూ, ఎనిమిది కీలక బిల్లులు 8 నుండి 23 మాసాల పాటు గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో పడి మూలుగుతున్నాయని పేర్కొన్నారు. ఆతర్వాత నవంబరు 29న జరిగిన విచారణలో గవర్నర్‌ ఒక బిల్లుకు ఆమోద ముద్ర వేశారని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియచేసింది. మిగిలిన ఏడు బిల్లులను పరిశీలించాల్సిందిగా రాష్ట్రపతికి నివేదించారని తెలిపింది. అయితే, రాష్ట్రపతికి నివేదించిన ఆ ఏడు బిల్లులు రాజ్యాంగంలోని 254వ అధికరణ (కేంద్ర, రాష్ట్రాల చట్టాల మధ్య అసమానత)ను ఉల్లంఘించాయా లేక కేంద్ర జాబితాలోకి వెళ్ళాయా అనేది గవర్నర్‌ వివరించాలని వేణుగోపాల్‌ కోర్టులో డిమాండ్‌ చేశారు. గవర్నర్‌ ఖాన్‌ గుడ్డిగా ఏడు బిల్లులను రాష్ట్రపతికి పంపలేరని వేణుగోపాల్‌ వాదించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో వుండే అధికారులు అధికారాన్ని ఏకపక్షంగా వినియోగించలేరని పేర్కొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad