– కర్రెగుట్టల్లో ఎదురుకాల్పులు
– ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి
– మృతుల సంఖ్య పెరిగే అవకాశం
– బస్తర్ ఐజీ సుందర్ రాజ్
దద్దరిల్లుతున్న దండకారణ్యం
నవతెలంగాణ-చర్ల
నిర్మానుష్యంగా ఉండే కర్రెగుట్టల దండకారణ్యం బాంబుల మోత, తుపాకీ గుండ్ల వర్షాలతో దద్దరిల్లుతోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ధర్మ తార్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగుట్టలపై మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో బుధవారం ఉదయం భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసులకు తారసపడిన మావోయిస్టులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మావోయిస్టులకు దీటుగా భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు గురువారం వరకు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రాంతంలో ఇంకా భారీగా గాలింపు కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. మరోవైపు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం, నూగూరుతోపాటు బీజాపూర్ జిల్లా ఊసూరు, తార్లగూడెం పోలీస్ స్టేషన్ల పరిధిలోని కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. సుమారు 5వేల మందికిపైగా పోలీస్ బలగాలు, సీఆర్పీఎఫ్, కోబ్రా, డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్ భద్రతా దళాలు అడవుల్లో గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టాయి. మావోయిస్టు కీలక నాయకులు హిడ్మా పీఎల్‌జీఏ నెంబర్ వన్ దళం కోసం గాలింపు చర్యలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
పోలీసులు ‘బచావో కర్రెగుట్టలు’ పేరుతో నేటి వరకు సుమారు 80 గంటల పాటు స్పెషల్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇటు తెలంగాణ.. అటు ఛత్తీస్‌గఢ్‌లో విస్తరించి ఉన్న కర్రెగుట్టలు సుమారు 250 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. వేలాది మందితో కూడిన భద్రతా బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టి పూర్తిగా వారి ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అటవీ ప్రాంతంతోపాటు కర్రెగుట్టలపైనా హెలికాప్టర్లు తిరుగుతున్నాయని, కాల్పుల శబ్దాలు కూడా వినిపిస్తున్నాయని, ఇటు వెంకటాపురం, వాజేడు, ఆలుబాకా ఎదిర సూరవీడు కాలనీ, అటు ఛత్తీస్‌గఢ్ వైపు రాంపురం, భీమారం, కస్తూర్ పాడు, చిన్న ఉట్ల, పెద్ద ఉట్ల, పూజారి కాంకేర్ గుంజపర్తి, నంబి, గలగం నడిపల్లి ఊసురు, పేరంపల్లి శ్యామలదొడ్డి, ఎలిమిడి, ఏగిపల్లి, పెంకనపల్లి, పాముగల్ ఉసకలేడు, రుద్రారం గ్రామాల ప్రజలు చెబుతున్నారు. పేలిన శబ్దాలు వినపడటంతోపాటు హెలికాప్టర్లు తిరిగిన రణ ఘనగోలతో రాత్రులు నిద్ర లేకుండా పోతున్నట్టు ఆయా ప్రాంత ప్రజలు వాపోతున్నారు. ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని చిగురుటాకుల్లా వణికి పోతున్నారు.
దద్దరిల్లుతున్న దండకారణ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES