నవతెలంగాణ-హైదరాబాద్: దళితుల అంశాలపై రెండు నాల్కల ధోరణి ప్రదర్శించే ప్రభుత్వాల పట్ల అట్టడుగు వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఎస్పీ అధినేత మాయవతి అన్నారు. ఏప్రీల్ 14న బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగిన వేడుకల్లో పలు చోట్ల దళితులపై దాడులు జరగడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు ప్రభుత్వ “ద్వంద్వ స్వభావాన్ని బయటపెడుతున్నాయి. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, ఈసారి దేశంలోని అనేక రాష్ట్రాల్లో, ఆయన విగ్రహాన్ని అగౌరవపరిచే సంఘటనలు, ఆ సందర్భంగా కార్యక్రమాలపై భూస్వామ్య శక్తుల దాడి, అనేక మంది గాయపడిన సంఘటనలు చాలా సిగ్గుచేటు, ప్రభుత్వాల ద్వంద్వ స్వభావానికి నిదర్శనం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్ లోని మోరేనా ప్రాంతంలో నిర్వహించిన ర్యాలీపై జరిగిన దాడిని ఖండించారు. ఈ దాడిలో ఓ దళితుడు మృతి చెందగా..పలువురు తీవ్రంగా గాయపడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దాడులకు తెగబడిన వ్యక్తులపై ఇంతవరకూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె మండిపడ్డారు. దీంతో ప్రభుత్వ వైఖరి ఎంటో తమకు అర్థమవుతుందని ఆమె విమర్శించారు. బిఆర్ అంబేద్కర్ గౌరవార్థం ప్రభుత్వాలు నిర్వహించే కార్యక్రమాల వెనుక ఉన్న కపటత్వాన్ని కుల ఆధారిత సంఘటనలు వెల్లడిస్తున్నాయన్నారు. అలాగే, బాబా సాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే కార్యక్రమాలు దళిత ఓట్లను పొందేందుకు చేసే మోసమని ఇటువంటి కులతత్వ సంఘటనలను బట్టి స్పష్టమవుతోంది. ద్వంద్వ ప్రమాణాలు, వ్యక్తిత్వం, ముఖం కలిగిన ఇటువంటి పార్టీల పట్ల దళిత సమాజం జాగ్రత్తగా ఉండాలి” అని ఆమె స్పష్టం చేశారు. బిఎస్పి పాలనలో, ప్రభుత్వం ఎల్లప్పుడూ అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని, దళిత సమాజానికి న్యాయం జరిగేలా చూసిందన్నారు.
దళితులపై దాడులు ప్రభుత్వాల ద్వంద్వ స్వభావానికి నిదర్శనం: బీఎస్పీ
- Advertisement -
RELATED ARTICLES