Wednesday, April 30, 2025
Homeజాతీయందాడి భద్రతా వైఫల్యమే

దాడి భద్రతా వైఫల్యమే

– ఈ అంశంపై లోతైన పరిశీలన చేయాలి
– దేశాన్ని ఏకతాటిపై నడపాల్సిన సమయమిది
– ఈ విషాదకర ఘటనలోనూ బీజేపీ రాజకీయ లబ్దికి ఎత్తుగడ
– ఏప్రిల్‌ 25న దేశవ్యాప్తంగా క్యాండిల్‌ ర్యాలీ : కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీర్మానం
– ఘటనకు ఖండన.. బాధితులకు ప్రగాఢ సానుభూతి..
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రవాద దాడిని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీి) ఖండించింది. ఆ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. గురువారం నాడిక్కడ అక్బర్‌ రోడ్డులోని ఏఐసీసీ కార్యాలయంలో సీబ్ల్యూసీ సమావేశమై ఈ మేరకు తీర్మానం చేసింది. ఈ దుఖ:సమయంలో పూర్తిగా వారికి మద్దతుగా నిలబడతామని వెల్లడించింది. ఈ దాడి పాకిస్తాన్‌ మద్దతుతో సుదీర్ఘంగా పన్నిన కుట్రగా సీడబ్ల్యూసీ అభివర్ణించింది. పెహల్గాం ఉగ్రదాడి పిరికిపంద చర్య అని, ఘటన సూత్రధారి పాకిస్తానీ అని, ఇది భారత ప్రజాస్వామ్య విలువలపై నేరుగా దాడి అని అభిప్రాయపడింది. ఈ ఉగ్రదాడిలో పర్యాటకులను కాపాడే ప్రయత్నంలో భాగంగా ప్రాణత్యాగం చేసిన స్థానికుడి పోరాటాన్ని గుర్తు చేసుకొంది. ప్రధాని ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాల్సిన అవసరముందని ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర పాలిత ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం భద్రతా వైఫల్యమేనని అభిప్రాయపడింది. ఈ అంశంపై లోతైన పరిశీలన జరగాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేసింది. మరికొద్ది రోజుల్లో అమరనాథ్‌ యాత్ర ప్రారంభం కానుందని గుర్తు చేసింది. ఈ యాత్రకు భద్రత దృష్ట్యా అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రానికి సూచించింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పారదర్శకంగా.. సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. పర్యాటకంపై ఆధారపడి జీవించే స్థానిక ప్రజల జీవనోపాధిని పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషాదకర ఘటనను బీజేపీ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుంటుందని ఆరోపించింది. దేశాన్ని ఏకతాటిపై నడపాల్సిన ఈ సమయంలో విభేదాలు రేకేత్తించే విధంగా రెచ్చగొట్టడం తగదని బీజేపీ నేతలకు సీడబ్ల్యూసీ హితవు పలికింది. హిందువులను రెచ్చగొట్టి దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేసినట్టు తీర్మానంలో ఆరోపించింది. ప్రజలు శాంతియుతంగా ఉండాలని ఆశిస్తున్నట్టు స్పష్టం చేసింది. సీమాంతర ఉగ్రవాదాన్ని యుక్తితో ఐక్యంగా ఎదుర్కోవాలని తీర్మానంలో పేర్కొంది.
మీడియా సమావేశంలో జైరాం రమేశ్‌, పవన్‌ ఖేరాతో కలిసి పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ తీర్మానాన్ని చదివి వినిపించారు. అన్ని వర్గాల ప్రజలు, పార్టీలు.. పెహల్గామ్‌ దాడిని ఖండించాయని తీర్మానంలో గుర్తు చేశారు. ప్రస్తుత విషాద పరిస్థితి బీజేపీ విద్వేషానికి వాడుకుంటోందని కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. ఉగ్రదాడిని ఖండిస్తూ ఏప్రిల్‌ 25న దేశవ్యాప్తంగా క్యాండిల్‌ ర్యాలీ ఉంటుందని వేణుగోపాల్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img