– ఆయన వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి
– న్యాయవ్యవస్థపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి : అటార్నీ జనరల్‌కు సుప్రీం న్యాయవాది లేఖ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు గౌరవాన్ని, అధికారాన్ని తగ్గించే విధంగా అపనిందలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేపై ధిక్కరణ చర్యలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వా లని సుప్రీంకోర్టు న్యాయవాది అనాస్ తన్వీర్ అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణిని కోరారు. ఈ మేరకు ఆయనకు ఓ లేఖ రాశారు. దేశంలో జరుగుతున్న అన్ని అంతర్యుద్ధాలకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాయే కారణమని, అలాగే మత యుద్ధాలకు సుప్రీం కోర్టు కారణమని దూబే శనివారం ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి ప్రకటనలతో బీజేపీ ఏకీభవించ బోదని, కనీసం మద్దతు కూడా ఇవ్వబోదని ఆ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. కానీ జార్ఖండ్‌లోని గొడ్డా లోక్‌సభ స్థానానికి నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించిన దూబేపై చర్యలు తీసుకునేదీ లేనిదీ మాత్రం ఆయన చెప్పలేదు. దూబేపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని న్యాయవాది తన్వీర్ ఆ లేఖలో అటార్నీ జనరల్‌ను కోరారు. దూబే చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు నిస్పాక్షికతపై దురు ద్దేశాలు ఆపాదించేలా ఉన్నాయని ఆ లేఖలో ఆరోపించారు. ‘దూబే వ్యాఖ్యలలో సరైనవి కావు. అంతేకాక అవి గౌరవనీయ సుప్రీం కోర్టుపై అపవాదు వేస్తు న్నాయి. న్యాయ వ్యవస్థ నిస్పాక్షికతపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసేలా ఉన్నాయి. మతపరమైన అపనమ్మకాన్ని సృష్టించేలా ఉన్నాయి. ఇవన్నీ 1971వ సంవత్సరపు కోర్టు ధిక్కరణ చట్టంలోని సెక్షన్ 2 (సీ) (ఐ)లో నిర్వచించిన చర్యల పరిధిలోకే వస్తాయి’ అని వివరించారు. జస్టిస్ ఖన్నాకు వ్యతిరేకంగా దూబే చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అవి అవమాన కరమైనవే కాక ప్రమాదకరమైన ధోరణితో రెచ్చగొట్టేలా ఉన్నా యని ఆరోపించారు. దూబే ప్రకటన దేశంలోని అత్యున్నత న్యాయస్థానాన్ని అపఖ్యాతిపాలు చేస్తోందని, ప్రజలలో అప నమ్మకాన్ని, ఆగ్రహాన్ని కలిగించి అశాంతిని రేపుతోందని తన్వీర్ ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. నిరాధారమైన ఇలాంటి ఆరో పణలు చేయడం న్యాయవ్యవస్థ యొక్క సమగ్రత, స్వాతం త్య్రంపై జరిపిన దాడిగా ఆయన అభివర్ణిం చారు. ఆర్టికల్ 368 ప్రకారం చట్టాలను చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉన్నదని దూబే చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ అది తప్పుదారి పట్టించేదిగా ఉన్నదని, శాసన వ్యవస్థ అధికారాలను న్యాయ వ్యవస్థ అతిక్రమి స్తోందని చిత్రించేలా ఉన్నదని అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడడానికి ఆదేశాలు జారీ చేసే అధికారాన్ని ఆర్టికల్ 141, 142 సుప్రీంకోర్టుకు కట్టబెట్టాయని గుర్తు చేశారు. కాగా వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ఒక పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టులో తన్వీర్ వాదనలు వినిపిస్తున్నారు.
దూబేపై క్రిమినల్ చర్యలు తీసుకోండి
- Advertisement -