నవతెలంగాణ – హైదరాబాద్: సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా జస్టిస్ బీఆర్ గవాయ్‌పై ఓ న్యాయవాది దాడికి యత్నించటాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. దేశంలో అసహనం అత్యున్నత స్థాయికి చేరుకుందన్నారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్య మూలాలకే ముప్పు అని చెప్పారు. ఇది వ్యక్తిపై దాడి కాదని, వ్యవస్థపైనే దాడి అంటూ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మన దేశంలో అసహనం అత్యున్నత స్థాయికి చేరుకుంది. దీనికి నిన్న సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడి జరగడం ఒక దారుణమైన సంకేతం. ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయిపై జరిగిన దాడి యత్నాన్ని తీవ్రంగా, నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నా. న్యాయవ్యవస్థ గౌరవంపై జరిగిన ఈ సిగ్గుచేటైన దాడి కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదు, ఆ వ్యవస్థపైనే జరిగిన దాడి. విశ్వాసం వంటి సున్నితమైన అంశాలపై ఎలాంటి విభేదం ఉన్నా కూడా హింసను సమర్థించదు. ఇటువంటి దాడులు ప్రజాస్వామ్య మూలాలకే ముప్పు కలిగిస్తుంది’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.