Wednesday, April 30, 2025
Homeఅంతర్జాతీయంన్యూజెర్సీ నుండి 3,000 మంది నివాసితుల తరలింపు

న్యూజెర్సీ నుండి 3,000 మంది నివాసితుల తరలింపు

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌: అమెరికాలోని న్యూజెర్సీలో కార్చిచ్చు వ్యాపించడంతో సుమారు 3,000మంది నివాసితులను ఖాళీ చేయించారు. కార్చిచ్చుతో వేలాది ఎకరాలు దగ్ధమయ్యాయని, వందలాది నిర్మాణాలకు ముప్పు కలిగిస్తోందని రాష్ట్ర అగ్నిమాపక దళం మంగళవారం తెలిపింది. రాత్రి 10.30 గంటలకు ఓషన్‌ కౌంటీలో కార్చిచ్చు ప్రారంభమైందని, పది శాతం అదుపులోకి వచ్చాయని న్యూ జెర్సీ ఫారెస్ట్‌ ఫైర్‌ సర్వీస్‌ సోషల్‌మీడియా ఖాతా ఎక్స్‌లో పేర్కొంది. 3,200 ఎకరాల్లో మంటలు చెలరేగాయని మొదట నివేదించింది. రెండు గంటల అనంతరం మంటలు 8,500 ఎకరాల (3,440 హెక్టార్లు)కు వ్యాపించాయని పేర్కొంది. అగ్నిమాపక యంత్రాలు, బుల్డోజర్లు, క్షేత్ర స్థాయి సిబ్బందితో పాటు అనేక మంది అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బందిని మోహరించినట్లు అగ్నిమాపక సంస్థ తెలిపింది. కార్చిచ్చు చెలరేగడానికి గల కారణాలపై విచారణ చేపడుతున్నట్లు వెల్లడించింది. ఈ అంశంపై బుధవారం మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా తూర్పు తీరంలో అతిపెద్ద రక్షిత ప్రాంతాలలో ఒకటైన పైన్‌ బారెన్స్‌లో మంటలు చెలరేగాయని స్థానిక మీడియా తెలిపింది. న్యూజెర్సీని కరువు ప్రాంతంగా రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ శాఖ మార్చిలో ప్రకటించింది. కార్చిచ్చుతో సుమారు 25,000 మందికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని జెర్సీ సెంట్రల్‌ పవర్‌ అండ్‌ లైట్‌ ఎక్స్‌లో పేర్కొంది. కార్చిచ్చు కారణంగా న్యూజెర్సీ రాష్ట్రం గుండా వెళ్లే గార్డెన్ స్టేట్‌ పార్క్‌వేలోని ఒక విభాగాన్ని కూడా మూసివేసినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img