నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడిని సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది. పర్యాటకులపై జరిగిన దాడిని ‘ఉగ్రవాదుల పిరికి చర్య’గా పేర్కొంది. దాడిలో క్రూరంగా, అకాలంగా హత్యకు గురైన వారికి కోర్టు నివాళులర్పించింది. కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించింది. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ( పూర్తి ధర్మాసనం ) బుధవారం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. బాధితులకు, వారి కుటుంబాలకు సంఘీభావం తెలిపేందుకు కోర్టు కాంప్లెక్స్‌లో జడ్జీలు, న్యాయవాదులు, సిబ్బంది రెండు నిమిషాలు మౌనం పాటించారు.
”ఈ బుద్ధిహీనమైన హింసాత్మక చర్య అందరి మనస్సాక్షిని కదలించింది. ఉగ్రవాదపు క్రూరత్వం, అమానవీయతకు గుర్తుగా మిగిలింది” అని తీర్మానంలో పేర్కొంది. ”మృతిచెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. బాధితులు, కుటుంబాలకు దేశం అండగా నిలుస్తుంది. భారతదేశానికి మకుటాయమానంగా నిలిచే కాశ్మీర్‌లోని సహజ సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్న పర్యాటకులపై జరిగిన ఈ దాడి నిస్సందేహంగా మానవత్వ విలువలకు, జీవిత పవిత్రతకు అవమానకరం. దాడిని కోర్టు తీవ్రంగా ఖండిస్తుంది” అని తీర్మానంలో పేర్కొంది. ఉగ్రదాడులకు గురయ్యే కొండ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలను సందర్శించే పర్యాటకుల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని, జమ్ముకాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాన్నిఆదేశించాలని కోరుతూ న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.