ముంబయి: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులోనూ పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోమని ప్రకటించింది. పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో బిసిసిఐ గురువారం కీలక ప్రకటన విడుదల చేసింది. బిసిసిఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే అంశం గురించి సమీప భవిష్యత్తులో కనీసం చర్చ కూడా ఉండదు. అయితే, ఐసిసి ఈవెంట్లలో మాత్రం నిబంధనలకు అనుగుణంగా పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్‌లు ఆడుతుంది” అని తెలిపారు. ఇక దేవజిత్ సైకియా స్పందిస్తూ.. బిసిసిఐ తరఫున ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాం అని పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఐపిఎల్-2025లో భాగంగా బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ బాధితులకు నివాళి అర్పించింది.