– ఉపాధ్యాయ సంఘాలను కోరిన డాక్టర్ యోగితా రాణా
– ‘తెలంగాణ – ఫ్యూచర్ రెడీ’ అంశంపై సమావేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉపాధ్యాయ సంఘాలు పాఠశాలలను దత్తత తీసుకుని నాణ్యతను పెంచాలని విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా కోరారు. ‘తెలంగాణ- ఫ్యూచర్ రెడీ’ అనే అంశంపై బుధవారం హైదరాబాద్‌లో ఆమె ఉపాధ్యాయ సంఘాలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యమైన విద్య, నమోదు పెంచడానికి సలహాలు ఇవ్వాలని కోరారు. అంతకుముందు కార్యక్రమంలో పాఠశాల విద్యా సంచాలకులు ఇ.వి.నర్సింహా రెడ్డి, రాష్ట్ర విద్యార్థుల పర్ఫార్మెన్స్ ఎన్‌ఏఎస్, ఏఎస్‌ఇఆర్‌లలో ఏ విధంగా ఉంది? ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ఏ విధంగా తగ్గుతుంది? అనే విషయాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఉపాధ్యాయ సంఘాల నాయకులు పలు సూచనలు, సలహాలిచ్చారు. బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థుల ఎన్రోల్‌మెంట్ పెంచడానికి అందరూ కషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని జూన్‌లో కాకుండా ఏప్రిల్‌లో లేదా మే చివరి వారంలో నిర్వహిస్తే బాగుంటుందని చెప్పారు. ”ప్రీ ప్రైమరీ తరగతులను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభిస్తే ఎన్రోల్‌మెంట్ పెరుగుతుంది. టీచర్ ట్రైనింగ్స్ సెలవు దినాల్లో జరిపితే బాగుంటుంది. ఎక్స్పోజర్ విజిట్ టు గుడ్ స్కూల్స్ కార్యక్రమం పెడితే బాగుంటుంది. అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూల్‌తో అనుసంధానం చేయాలి. టీచర్స్ ట్రైనింగ్స్ క్వాలిటీ రిసోర్స్ పర్సన్స్ ద్వారా ఇప్పించాలి. సైకాలజిస్టులతో ఉపాధ్యాయులకు మోటివేషన్, కౌన్సిలింగ్ నిర్వహించాలి. ఇన్‌స్పెక్షన్ సిస్టంను బలోపేతం చేయడం ద్వారా క్వాలిటీని పెంచవచ్చు. రేషనలైజేషన్ ఆఫ్ టీచర్స్ చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రయివేటు స్కూల్స్‌పై చర్యలు తీసుకోవాలి. ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండేలా చూడాలి. స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్‌ని స్కూల్స్‌లో అమలు చేయాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుత టెక్ట్స్‌బుక్స్ సిలబస్‌ను మార్పు చేయాలి. రెగ్యులర్ డీఈఓలను, ఎంఈఓలను నియమించాలి.
క్రీడలను, ఫిజికల్ ఎడ్యుకేషన్‌ని ప్రతి స్కూల్‌లో నిర్వహించాలి. ఎన్‌రోల్‌మెంట్ ఎక్కువగా ఉన్న స్కూల్స్‌ని అధికారులు సందర్శించాలి. బెస్ట్ ప్రాక్టీసెస్‌ను మిగతా స్కూళ్లలో కూడా అమలు చేయాలి. ఉపాధ్యాయు లకు బోధనేతర పనులను తగ్గించాలి. ఉపాధ్యాయులు మెటర్నిటీ లీవ్‌లో, డిప్యుటేషన్‌లో ఉన్నప్పుడు ఇంకొక టీచర్‌ని తాత్కాలికంగా నియమించాలి. చాలా మంచిగా పనిచేస్తున్న పాఠశాలలు ఫ్లెక్సీ ద్వారా, లోకల్ టీవీ ఛానల్, పత్రికల ద్వారా ప్రచారం చేసుకోవాలి. బెస్ట్ స్కూల్ టీచర్స్ అవార్డులను అప్లికేషన్ మెథడ్‌లో కాకుండా అధికారులే గుర్తించి ఇవ్వాలి.” అని సంఘాల నాయకులు పలు సూచనలు చేశారు. అనంతరం యోగితా రాణా ఆయా సంఘాల ప్రతినిధులతో పరస్పర చర్చలు జరిపారు. తరచుగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల, సాంకేతిక విద్యా కమిషనర్ శ్రీదేవసేన, విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం.హరిత, పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకులు తదితరులు పాల్గొన్నారు.
కొఠారి కమిషన్ సూచనల మేరకు రాష్ట్ర బడ్జెట్‌లో 30 శాతం నిధులు కేటాయించాల్సి ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వం కేటాయించలేదని వారు గుర్తుచేశారు. కనీసం కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 15 శాతం కేటాయించి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. పేదలకు విద్యను దూరం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన జాతీయ విద్యావిధానం-2020ను రాష్ట్రంలో అమలు చేయకుండా తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని జిల్లాలకు డీఈఓ, రెవెన్యూ డివిజన్, నియోజకవర్గానికి ఒక డిప్యూటీ ఇఓ, ప్రతి మండలానికి ఒక ఎంఈఓ పోస్టులను మంజూరు చేసి రెగ్యులర్ నియామకాలను చేపట్టాలని సూచించారు. పాఠశాలలపై అకడమిక్ పర్యవేక్షణ పెంచాలనీ, ప్రతి ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలనీ, తరగతికొక ఉపాధ్యాయుడు, పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పలు సూచనలు చేసిన ఫెడరేషన్, రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కావాల్సిన ఉపాధ్యాయుల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించేందుకు వీలైనంత త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో మరొక సమావేశం నిర్వహించాలని కోరింది.
భవిష్యత్తులోనూ కొనసాగించాలి : టీఎస్ యూటీఎఫ్
ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయటాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) స్వాగతించింది. ఈ సత్సంప్రదాయాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, కార్యదర్శి ఎ.సింహాచలం పాల్గొన్నారు. రాష్ట్రంలో పాఠశాల విద్యారంగం పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇస్తున్న పిలుపుతో ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ఇంటింటికి తిరిగి విద్యార్థులను చేర్పించే పనిలో ఉంటున్నారని తెలిపారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు, ప్రయివేటు, కార్పొరేటు పాఠశాలల ప్రచారార్భాటం, సమాజంలో నెలకొన్న అసమానతల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరటం లేదని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంచేందుకు, పూర్వవైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే చర్యలన్నింటికీ ఫెడరేషన్ తరపున సంపూర్ణంగా సహకరిస్తామని తెలిపారు. విద్యాశాఖ కార్యదర్శి కోరిక మేరకు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యార్థుల నమోదు పెంపు, నాణ్యతా ప్రమాణాల మెరుగుదలకు 29 సూచనలు చేశారు.
పాఠశాలలను దత్తత తీసుకోండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES