Wednesday, April 30, 2025
Homeతాజా వార్తలుపాములు, కుక్కలు కాటేస్తున్నాయి..

పాములు, కుక్కలు కాటేస్తున్నాయి..

– కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థినుల ఆందోళన
– వీసీ ఛాంబర్‌ ముట్టడి హాస్టల్‌లో కనీస వసతులు లేవని ఆవేదన
నవతెలంగాణ -సుల్తాన్‌ బజార్‌
హైదరాబాద్‌ కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. యూనివర్సిటీ హాస్టల్లో సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ గురువారం యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్‌ సూర్య ధనుంజరు కార్యాల యాన్ని ముట్టడించారు. హాస్టల్‌ సమ స్యలు పరిష్కరించడంలో వీసీ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ బైటాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ.. విశ్వ విద్యాలయం ప్రాంగణంలో కుక్కలు, ఎలుకలు, పాములు తిరుగుతున్నాయన్నారు. గతంలో కుక్కలు పలువురు విద్యార్థినులను కరిచినట్టు తెలిపారు. ఓ విద్యార్థిని పాము కాటుకు గురైనట్టు చెప్పారు. వార్డెన్‌కు ఎన్నిసార్లు సమస్య చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. తాగడానికి నీరు కూడా రావడం లేదన్నారు. సుల్తాన్‌ బజార్‌ పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
హాస్టల్‌ భవనాన్ని సందర్శించిన వీసీ
విద్యార్థినుల ఆందోళనతో వీసీ హాస్టల్‌ భవనాన్ని సందర్శించారు. హాస్టల్‌ ఇన్‌చార్జి విజయలక్ష్మీ, ప్రిన్సిపాల్‌ లోక పావనితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. కొంతకాలంగా హాస్టల్‌లో నీళ్ల సమస్య ఉండటం వాస్తవమేనని, సమస్య పరిష్కారానికి రెండు బోర్లు వేయించామని తెలిపారు. దోమలు, పాములు, కుక్కలు, ఎలుకల బెడద ఎక్కువగా ఉందని, తరచూ ఎలుకలు కరుస్తున్నాయని విద్యార్థినులు చెబుతున్నారని అన్నారు. వీటి పరిష్కారం కోసం ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. అయితే, విద్యార్థినులు పరీక్షలు వాయిదా వేయాలని కోరగా.. తాము యథావిధిగా నిర్వహిస్తామని చెప్పడంతోనే హాస్టల్‌ సమస్యలను ముందుకు తెచ్చారని ఆరోపించారు. హాస్టల్‌లో అన్ని వసతులూ కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img