– జపాన్ వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్ పిలుపు
– ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభం
– దేశం నుంచి ఎక్స్‌పోలో పాల్గొన్న మొదటి రాష్ట్రంగా రికార్డు
– నేడు హైదరాబాద్‌కు సీఎం బృందం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పెట్టుబడులు, శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో సహకారం లక్ష్యంగా జపాన్‌లో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి బృందం సోమవారం దేశంలోనే కొత్త రికార్డును నమోదు చేసింది. ఏడేండ్లకోసారి జరిగే ఒసాకో ఎక్స్‌పోలో దేశం నుంచి ఏ రాష్ట్రం ఇప్పటి వరకు పాల్గొనలేదు. మొదటి సారిగా ఆ ఎక్స్‌పోలో పాల్గొన్న తెలంగాణ పెవిలియన్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం సోమవారం ప్రారంభించారు. వివిధ రంగాలకు చెందిన వ్యాపార వేత్తలు, పారిశ్రామికవేత్తలతో ఈ సందర్భంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం అనుసరిస్తున్న స్థిరమైన విధానాలు, సులభతర పారిశ్రామిక విధానం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణలో ఉన్నాయని చెప్పారు. ”హైదరాబాద్‌కు రండి.. మీ ఉత్పత్తులు తయారు చేయండి.. భారత మార్కెట్‌తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోండి. విరివిగా పెట్టుబడులు పెట్టండి” అని జపాన్ కంపెనీలను సీఎం రాష్ట్రానికి ఆహ్వానించారు. తెలంగాణకు జపాన్ మధ్య చక్కటి సంబంధాలున్నాయనీ, ఒసాకా బేలో సూర్యోదయం లాంటి కొత్త అధ్యాయం రాష్ట్రంలో ప్రారంభమవుతోందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. తెలంగాణ, జపాన్‌ల మధ్య ఉన్న చారిత్రక స్నేహాన్ని దీర్ఘకాల భాగస్వామ్యంగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. కొత్త ఆవిష్కరణలతో భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు కలిసి పనిచేద్దామనే ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. ఐటీ, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్ రంగాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను ఆ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలకు వివరించారు. ఎకో ఎనర్జీ, స్మార్ట్ మొబిలిటీ, సర్క్యులర్ ఎకానమీ ప్రామాణికంగా హైదరాబాద్‌లో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని వారికి చెప్పారు. హైదరాబాద్ చుట్టూ 370 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్), రేడియల్ రోడ్లతో పాటు ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) మధ్య ఉన్న జోన్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్ పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందని పేర్కొన్నారు. జపాన్‌కు చెందిన మారుబెని కార్పొరేషన్ ఫ్యూచర్ సిటీలో ఇండిస్టియల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఎగుమతులకు వీలుగా సమీప ఓడరేవుతో అనుసంధానించే డ్రై పోర్ట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. మూసీ పునరుజ్జీవంలో భాగంగా నది పొడవునా 55 కిలోమీటర్ల అర్బన్ గ్రీన్‌వేను అభివృద్ధి చేసేందుకు టోక్యో, ఒసాకా నగరాలను చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ నైపుణ్యాల శిక్షణతో పాటు నాణ్యత, క్రమశిక్షణకు అద్దం పట్టేలా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ బృందం మంగళవారం ఒసాకా నుంచి హిరోషిమా చేరుకుంటుంది. అక్కడి పీస్ మెమోరియల్ సందర్శించి గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. స్థానిక వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మెన్‌తో సమావేశం తదితర కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. అనంతరం ఒసాకాలోని కాన్సారు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి రాత్రి బయల్దేరి బుధవారం ఉదయానికి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
పెట్టుబడులు పెట్టండి
- Advertisement -
- Advertisement -