Wednesday, April 30, 2025
Homeతాజా వార్తలుపేదల భూములు కొల్లగొట్టే కుట్ర

పేదల భూములు కొల్లగొట్టే కుట్ర

– కమ్యూనిస్టులు పంచిన భూములపై కన్ను
– సుమారు 700 ఎకరాలు కాజేసే యత్నం
– రంగంలోకి దిగిన ఓ కేంద్ర మంత్రి
– రెవెన్యూ అధికారులకు అల్టిమేటం జారీ..?
– ఇప్పటికే పలు ఎకరాలు అధికార పార్టీ నాయకుల చేతుల్లోకి..
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
నాడు కమ్యూనిస్టులు పేదలకు పంపిణీ చేసిన భూములపై నేడు పెద్దల కన్ను పడింది. ఆ భూములను రైతుల నుంచి లాక్కునేందుకు బడా వ్యాపారులు ‘గోతి కాడి నక్కలా’ కాచుకుని ఉన్నారు. సుమారు 700 ఎకరాలను కాజేసే కుట్రలకు తెర లేపారు. రైతులు సాగులో ఉన్నప్పటికీ హక్కు పత్రాలు లేకపోవడంతో అదే అదనుగా వ్యాపారులు రైతులను భయపెట్టి ఆ భూములను లాక్కోవాలని చూస్తున్నారు. అయితే, వీరి వెనుక ఓ కేంద్ర మంత్రి ఉండటం గమనార్హం. సదరు మంత్రి తన అనుచరులను రంగంలోకి దింపి.. రైతులకు మాయమాటలు చెప్పించి.. భూములు తీసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఆ భూములకు నాటి భూస్వాముల పేర ఓఆర్‌సీ ఇవ్వాలని ఆ మంత్రి రెవెన్యూ అధికారులకు ఇటీవల లేఖ కూడా రాసినట్టు తెలుస్తోంది. పేదల భూములపై కేంద్ర మంత్రి కన్ను పడటం.. ఇదంతా రహస్యంగా జరుగుతుండటంతో జిల్లాలో తీవ్ర చర్చనీయాశం గా మారింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ నుంచి జిల్లాల విభజనలో భాగంగా రంగారెడ్డిలో కలిసిన మాడ్గుల మండలం ఇర్విన్‌ రెవెన్యూ పరిధి, నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దాండ మండలం అజిలాపూర్‌ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్‌ 1003 నుంచి 1053 వరకు సుమారు 700 ఎకరాల భూములు ఉన్నాయి. అవి ‘కుందారం’ భూస్వాముల చేతిలో ఉండేవి. ఈ భూములను ఆనాటి కమ్యూనిస్టులు స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేశారు. దాదాపు 30 ఏండ్లుగా రైతులు సాగు చేసుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా అప్పటి కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకుని కొంతమందికి ఓఆర్‌సీలు (యాజమాన్యపు హక్కు పత్రం) ఇచ్చారు. 80 శాతం మంది రైతులకు ఇప్పటికీ ఓఆర్‌సీ లేదు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో ఆన్‌లైన్‌లో భూస్వాముల పేర్లు వచ్చాయి. సర్వే నెంబర్‌ 1003 నుంచి 1053 వరకు సుమారు 700 పైచిలుకు ఎకరాల భూములు కుందారపు వంశానికి చెందిన రఘుమారెడ్డి, గీతారెడ్డి, సీతారెడ్డి, మోహన్‌రెడ్డి రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారులుగా ఉన్నారు. దాంతో ఆ భూముల నుంచి పేదలను వెళ్లగొట్టి, కాజేయాలని బడా వ్యాపారులు కుట్రలు చేస్తున్నారు.
రైతులను మభ్యపెడుతున్న వ్యాపారులు
‘ఈ భూములు మీకు ఎన్నటికీ సొంతం కావు.. వదిలేయండి’ అంటూ రైతుల్లో భయాందోళన కల్గిస్తూ వాటిని కాజేసేందుకు వ్యాపారులు కుట్రలు చేస్తున్నట్టు తెలిసింది. ఓఆర్‌సీ లేని భూములను టార్గెట్‌గా చేసుకుని రైతుల వద్దకు వెళ్తున్నారు. రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని పేదల చేతుల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల 50 ఎకరాలకు ఓఆర్‌సీ కావాలని రెవెన్యూ అధికారులకు వ్యాపారవేత్తలు దరఖాస్తు కూడా చేసుకున్నట్టు తెలిసింది. అసైన్డ్‌ భూములకు కూడా నయానో భయానో ఇచ్చి రైతులతో అగ్రిమెంట్లు చేసుకుంటున్నారని రైతులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు కొనసాగుతోంది.
ఈ భూములపై కన్నేసిన కేంద్ర మంత్రి
ఈ ప్రాంతంలో రీజినల్‌ రింగ్‌ రోడ్డు వస్తుండటంతో ఈ భూములపై ఓ కేంద్ర మంత్రి కన్నుపడింది. భూములను ఎలాగైనా కాజేయాలన్న దానితో తన అనుచరులను రంగంలోకి దింపారు. రైతులకు మాయమాటలు చెప్తూ.. ఆ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఈ తంతు కొనసాగిస్తూనే.. ఆ భూములకు సంబంధించి భూముల ఓనర్ల పేరు మీద యాజమాన్య హక్కు కల్పించాలని సదరు మంత్రి రెవెన్యూ అధికారులకు ఇటీవల లేఖ రాసినట్టు సమాచారం. కేంద్ర మంత్రి సహకారంతో రైతుల నుంచి ఆ భూములను లాక్కునేందుకు బడా వ్యాపారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఆ భూములు తమకే దక్కేలా చూసి, హక్కు పత్రాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img