– దోషులుగా తొమ్మిది మంది
– అందరికీ యావజ్జీవం విధించిన మహిళా న్యాయస్థానం
– బాధితులకు రూ.85లక్షల పరిహారమివ్వాలని ఆదేశాలు
కోయంబత్తూరు: తమిళనాడులోని పొల్లాచిలో 2019లో జరిగిన లైంగిక వేధింపుల కేసులో కోయంబత్తూరులోని మహిళా కోర్టు మంగళవారం సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో మొత్తం 9మంది నిందితులను దోషులుగా నిర్థారిస్తూ జీవిత ఖైదు విధించింది. ప్రాసిక్యూషన్, డిఫెన్స్ పక్షాల వాదనలు విన్న తర్వాత జస్టిస్ ఆర్.నందిని దేవి దోషులకు జీవితఖైదు విధిస్తున్నట్లు తీర్పునిచ్చారు. ఈ కేసులోని ఎనిమిదిమంది బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా రూ.85 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. శబరిరాజన్ అలియాస్ రిష్వంత్, తిరునావుక్కరసు, టి.వసంతకుమార్, ఎం.సతీష్, ఆర్.మణి అలియాస్ మణివన్నన్, పి.బాబు, హరోన్‌పాల్, అరుళనంతం, అరుణ్‌కుమార్‌లను కోర్టు దోషులుగా నిర్ధారించింది. 2019లో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారిపై క్రిమినల్ కుట్ర, లైంగిక వేధింపులు, లైంగికదాడి సామూహిక అఘాయిత్యం, ఒకే వ్యక్తిపై పలుమార్లు దారుణాలకు పాల్పడడం వంటి పలు అభియోగాలు నమోదయ్యారు. వాటన్నింటిలోనూ వారిని దోషులుగా న్యాయస్థానం నిర్ధారించింది. అరెస్ట్ అయినప్పటి నుండి వీరందరూ సేలం సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలోనే వున్నారు. భారీ పోలీసు భద్రత మధ్య వారిని మంగళవారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు. కళాశాల విద్యార్థినితో పాటు సుమారు తొమ్మిదిమంది మహిళలపై దోషులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. 2016- 2018 మధ్య ఈ నేరాలు జరిగాయని, ఈ అఘాయిత్యాలను వీడియో తీశారని, తర్వాత ఆ వీడియోలతో బాధితులను నగదు కోసం బ్లాక్‌మెయిల్ చేయడంతో పాటు పదేపదే లైంగికదాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. మొదట పొల్లాచి పోలీసులు దర్యాప్తు చేసిన ఈ కేసును తర్వాత తమిళనాడు సీబీ-సీఐడీకి , ఆ తర్వాత సీబీఐకి బదిలీ చేశారు. 2019 ఫిబ్రవరి 24న ఒక కాలేజీ యువతి పొల్లాచి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 12 రోజుల క్రితం పొల్లాచికి సమీపంలో కదులుతున్న కారులో నలుగురు వ్యక్తులు లైంగిక దూషణలకు పాల్పడ్డారని ఆరోపించింది. 2016 నుంచి యువతులను లక్ష్యంగా చేసుకుని, వారిని ప్రలోభ పెట్టి లైంగిక దాడులకు పాల్పడుతున్న వ్యక్తుల బృందానికి వ్యతిరేకంగా మాట్లాడింది 19ఏండ్ల ఆ కాలేజీ యువతే. కేవలం మధ్య తరగతి, దిగువ సామాజిక, ఆర్థిక నేపథ్యాలు కలిగిన కుటుంబాలకు చెందిన యువతులనే నిందితులు లక్ష్యంగా చేసుకునేవారని దర్యాప్తులో వెల్లడైంది. లెక్కలేనంతమందిపై దారుణాలు జరిగినా కేవలం వారిలో 8మంది మాత్రమే సాక్ష్యమివ్వడానికి ముందుకొచ్చారు. మొట్టమొదటగా నిందితుల నేరాలను బయటపెట్టిన కాలేజీ యువతికే ఈ సందర్భంగా మనం కృతజ్ఞతలు తెలియచేసుకోవాలని ఆమె తరపు న్యాయవాది వ్యాఖ్యానించారు. ఈ కేసు రాజకీయంగా కూడా వివాదాన్ని రేపింది.నిందితుల్లో ఒకరైన అరుళనంతం అన్నాడీఎంకే పొల్లాచి పట్టణ విద్యార్ధి విభాగ కార్యదర్శి కావడంతో అన్నాడీఎంకే ప్రభుత్వం ఈ ఆరోపణలను తిరస్కరించడంతో పాటు ఈ కేసును కప్పిపుచ్చేందుకు యత్నించింది. నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదులో కూడా ఆలస్యం జరిగింది. దీనిపై కూడా పలు విమర్శలను ఎదుర్కొంది.
పొల్లాచి లైంగిక వేధింపుల కేసు…
- Advertisement -
- Advertisement -