– ధ్రువీకరించిన వాటికన్
వాటికన్ సిటీ: ప్రపంచ శాంతి కోసం పరితపించిన పోప్ ఫ్రాన్సిన్ ఇకలేరు. 88 సంవత్సరాల పోప్ దీర్ఘకాల అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారని వాటికన్ ఓ వీడియోలో తెలియజేసింది. ‘ఉదయం 7.35 గంటలకు రోమ్ బిషప్ పోప్ ఫ్రాన్సిస్ తన తండ్రి నివాసానికి తిరిగి వెళ్లారు. ఆయన తన జీవితాంతం ప్రభువు సేవకు, చర్చి సేవకు అంకితమయ్యారు’ అని వాటికన్ ప్రధాన పీఠాధి పతులలో ఒకరైన కార్డినల్ కెవిన్ ఫెర్రెల్ తెలిపారు. సమాజంలోని అత్యంత నిరుపేదల కోసం పనిచేయాలని ఆయన తమకు బోధించారని చెప్పారు. రోమన్ కాథలిక్ చర్చికి నాయకత్వం వహించిన తొలి లాటిన్ అమెరికన్ గురువు ఫ్రాన్సిస్. ఆయన 2013 మార్చి 13న పోప్‌గా ఎన్నికయ్యారు. ఈస్టర్ పర్వదినం రోజున ఆయన సెయింట్ పీటర్ స్క్వేర్‌లో 35,000 మంది భక్తులకు దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘సోదర సోదరీమణులారా…మీకు ఈస్టర్ శుభాకాంక్షలు’ అంటూ సెయింట్ పీటర్స్ బాసిలికాలోని లాగియా బాల్కనీ నుండి సందేశమిచ్చారు. అయితే ఆ మరునాడే కన్నుమూయడం ప్రపంచ మానవాళిని దిగ్భ్రాంతికి గురిచేసింది. పోప్ ఫ్రాన్సిస్ డబుల్ న్యుమోనియా బారిన పడి కోలుకున్నారు. గత 12 సంవత్సరాల కాలంలో ఆయన అనేక పర్యాయాలు అనారోగ్యానికి గురయ్యారు. ఇటీవలే శ్వాసకోస సమస్యకు చికిత్స కూడా పొందారు.
1936 డిసెంబర్ 17న బ్యూనస్ ఎయిర్స్‌లో జన్మించిన జార్జ్ మరియో బెర్గోగ్లియో (ఇప్పటి పోప్ ఫ్రాన్సిస్) ఇటలీ వలసదారులకు జన్మించిన ఐదుగురిలో ఒకరు. ఆయన రైల్వేలో అకౌంటెంట్‌గా పనిచేశారు. కెమికల్ టెక్నీషియన్‌గా పట్టభద్రుడైన తర్వాత మత బోధనలు చేయాలని నిర్ణయించుకున్నారు. విల్లా డెవోటోకు చెందిన డయోసెసాన్ సెమినరీలో చేరారు. 1958 మార్చి 11న జీసస్ సొసైటీ నొవిటియేట్‌లో చేరారు. తాను రాజీనామా లేఖ రాశానని పోప్ ఫ్రాన్సిస్ గతంలోనే తెలిపారు. వైద్యపరంగా బాధ్యతలు నిర్వర్తించలేనప్పుడు అది అమలులోకి వస్తుందని, అప్పుడు నూతన పోప్‌పై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
తుది సందేశంలోనూ శాంతి మంత్రం
పోప్ ఫ్రాన్సిస్ ఈస్టర్ మాస్‌ను జరుపుకోలేదు. అయితే అక్కడికి చేరుకున్న బాలబాలికలను ఆశీర్వదిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా పోప్ అందించిన సందేశాన్ని ఆర్చ్‌బిషప్ డియాగో రావెల్లీ చదివి వినిపించారు. గాజా, ఉక్రెయిన్, కాంగో, మయన్మార్ సహా ప్రపంచంలో సంఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలలో శాంతి నెలకొనాలని పోప్ ఆకాంక్షించారు. ‘పోరాటం చేస్తున్న వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. కాల్పుల విరమణకు పిలుపునివ్వండి. బందీలను విడుదల చేయండి. శాంతి, భవిష్యత్తును కోరుకుంటూ ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు సాయం చేయండి. వలసవాదులు, అణగారిన ప్రజల పట్ల కరుణ చూపండి. ఈ రోజున మనమందరం కొత్త ఆశలు పెట్టుకోవాలి. మన కంటే భిన్నమైన వారు సహా ఇతరులలో మన నమ్మకాన్ని పునరుద్ధరించుకోవాలి’ అని పోప్ పిలుపునిచ్చారు. ఈస్టర్ పర్వదినాన ఉదయం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన కుటుంబసభ్యులు వాటికన్‌లో పోప్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వాన్స్ పిల్లలకు పోప్ మూడు పెద్ద చాక్లెట్ ఈస్టర్ గుడ్లు ఇచ్చారు.
తదుపరి పోప్ ఎన్నిక
పోప్ మరణిస్తే కొత్త పోప్‌ను ఎన్నుకోవడానికి రోమన్ కాథలిక్ చర్చికి ఓ విస్తృతమైన విధానం ఉంది. పోప్ మరణించినప్పుడు లేదా రాజీనామా చేసినప్పుడు చర్చి ‘ఖాళీ స్థానం లేదా ఖాళీ చేసిన స్థానం’ అనే స్థితికి చేరుతుంది. సెయింట్ పీటర్ సింహాసనం ఖాళీ అయినప్పుడు ఇలా జరుగుతుంది. ఇది కొన్ని వారాల పాటు కొనసాగుతుంది. ఆ సమయంలో దివంగత పోప్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారు. అనంతరం కొత్త పోప్‌ను ఎన్నుకోవడాదనికి కార్డినల్స్ సమావేశమవుతారు. పోప్ స్థానం ఖాళీ అయిన 15-20 రోజుల మధ్య ఈ సమావేశం జరుగుతుంది.
పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES