– రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి : విదేశీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– భారత్ సమ్మిట్‌లో నేడు టెర్రరిజానికి వ్యతిరేకంగా తీర్మానం
– అహింస, సత్యం, సామాజిక న్యాయం ఎజెండా
– మొదటి రోజు నాలుగు అంశాలపై చర్చ
– మహిళల ప్రాతినిధ్యం ఉండటం లేదంటూ ఆందోళన
– పహల్గాం దాడి నేపథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు
– ఖర్గే, రాహుల్ దూరం
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
భారత్ సమ్మిట్‌లో ప్రధానంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటూ విదేశీ ప్రతినిధులను కోరినట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన భారత్ సమ్మిట్‌లో అహింస, సత్యం, సామాజిక న్యాయం ఎజెండాగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మౌలిక సిద్ధాంతాలను అంగీకరించే ప్రజాస్వామిక వాదులు, ప్రగతిశీల వాదులు ఈ సమ్మిట్‌కు హాజరైనట్టు తెలిపారు. శుక్ర వారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్ హోటల్‌లో ప్రారంభమై న భారత్ సమ్మిట్ మొదటి రోజు పూర్తయిన సందర్భంగా భారత్ సమ్మిట్ కో ఆర్డినేటర్ సల్మాన్ ఖుర్షీద్, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నెరేళ్ల శారద, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, సీనియర్ నేత మధుయాష్కీగౌడ్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. భారత్ సమ్మిట్ ప్రభుత్వ కార్యక్రమమా? పార్టీ కార్యక్రమమా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ… కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ భావజాలాన్నే కాంగ్రెస్ ప్రభుత్వం కలిగి ఉందని తెలిపారు. కార్యక్రమానికి వివిధ దేశాల నుంచి వివిధ రంగాల్లో నిష్ణాతులైన నిపుణులు హాజరయ్యారని చెప్పారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక న్యాయం, అభివృద్ధి, సంక్షేమ పథకాలను పూర్తిగా వివరించినట్టు తెలిపారు. ఈసందర్భంగా రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతినిధులు అభినందించారని హర్షం వ్యక్తం చేశారు. ప్రగతిశీల ఆలోచనతో ప్రపంచానికి తెలంగాణను మోడల్‌గా చూపించేందుకు సమ్మిట్ ఉపయోగపడుతున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక సమ్మిట్ తెలంగాణ మార్కెట్‌కు, పెట్టుబడులను ఆకర్షించేందుకు, సంపద పెంచుకునేందుకు, నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పించేందుకు దోహదపడుతుందన్నారు. సమ్మిట్‌కు దాదాపు వంద దేశాలకు చెందిన 450 మంది కార్పొరేట్ ప్రముఖులు, విదేశీ ప్రభుత్వాల ప్రతినిధులు హాజరయ్యారు. ఉగ్రదాడికి నిరసనగా సంతాపం తెలిపే కార్యక్రమంలో తాము కూడా భాగస్వాములవుతామని విదేశీ ప్రతినిధులు ఆసక్తి చూపించినట్టు భట్టి వెల్లడించారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం తలపెట్టిన ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమంలో ప్రపంచం మొత్తాన్ని భాగస్వాములను చేసినట్టైందన్నారు. ఏఐసీసీ సభ్యులు సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక న్యాయం దేశానికే ఆదర్శమని ప్రశంసించారు. రాహుల్ గాంధీ అందరికీ సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నారని తెలిపారు. దానిని సాధించేందుకు అవసరమైన డాటా, విశ్లేషణ అవసరమనీ, ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం అభినందనీయమని చెప్పారు. సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
కొన్ని కార్యక్రమాలు వాయిదా
భారత్ సమ్మిట్ 2025లో భాగంగా శుక్రవారం జరగాల్సిన పలు కార్యక్రమాలు శనివారానికి వాయిదా వేశారు. తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలతో విదేశీ ప్రతినిధులకు ఘనంగా ఆహ్వానం పలికేందుకు రూపొందించుకున్న కార్యక్రమాలన్నీ రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వం టెర్రరిస్టు దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాప దినంగా ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేయాల్సిన హైదరాబాద్ డిక్లరేషన్ సైతం వాయిదా పడింది.
నాలుగు అంశాలపై చర్చ
భారత్ సమ్మిట్‌లో మొదటి రోజు నాలుగు అంశాలపై చర్చ జరిగింది. జెండర్ సమానత్వం-మహిళా భవిష్యత్తు, తప్పుడు సమాచారానికి, వాస్తవాలకు మధ్య జరుగుతున్న పోరాటం, యువత, భవిష్యత్తు రాజకీయాలు, మారుతున్న పరిస్థితుల అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఆయా దేశాల్లో యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులను సమ్మిట్ దృష్టికి తీసుకొచ్చారు. వివిధ దేశాల మధ్య జరుగుతున్న శాంతి చర్చల్లో మహిళల ప్రాతినిధ్యం ఉండటం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
– తమ అనుభవాలు పంచుకున్న స్వదేశీ, విదేశీ ప్రతినిధులు
ఖర్గే, రాహుల్, ప్రియాంక దూరం
భారత్ సమ్మిట్ సందర్భంగా జరగనున్న ప్లీనరీ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ఎంపీ ప్రియాంకగాంధీ దూరంగా ఉన్నారు. పహల్గాం దాడుల నేపథ్యంలో వారు దూరంగా ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. 100 దేశాలకు పైబడిన ప్రభుత్వ అధినేతలు, ప్రతినిధులు, కార్పొరేట్ దిగ్గజాలు.. ఇలా మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా
450 మంది ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. శనివారం టెర్రరిజానికి వ్యతిరేకంగా తీర్మానం చేయనున్నారు.
ప్రగతిశీల ఆలోచనలకు తెలంగాణ మోడల్
- Advertisement -
RELATED ARTICLES