Wednesday, April 30, 2025
Homeఅంతర్జాతీయంప్రపంచ వృద్ధి అంచనాలకు ఐఎంఎఫ్‌ కోత

ప్రపంచ వృద్ధి అంచనాలకు ఐఎంఎఫ్‌ కోత

– అమెరికా టారిఫ్‌ల ప్రభావమే కారణం
– పొంచి వున్న ప్రమాదాలపై ఆందోళన
వాషింగ్టన్‌: 2026 ఆర్థిక సంవత్సరానికి భారత్‌ వృద్ధిరేటును 30 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 6.2శాతం మేరా వృద్ధి చెందగలదని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) మంగళవారం అంచనా వేసింది. ఇందుకు వాణిజ్య ఉద్రిక్తతలు అంతర్జాతీయ అస్థిరతలు, అనిశ్చుతులు కారణాలుగా పేర్కొంది. తాజాగా ప్రపంచ ఆర్థిక దృక్పథం (డబ్లుఇఓ) నివేదిక కూడా ఇవే అంశాలు పేర్కొంది. ”భారత్‌కు సంబంధించినంతవరకు, 2025-26లో వృద్ధిరేటు సాపేక్షంగా 6.2శాతం వద్ద మరింత సుస్థిరంగా వుండగలదు. ప్రైవేటు వినిమయం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వినిమయం ఇందుకు దోహదపడుతోంది. అయితే 2025 జనవరిలో అంచనా వేసిన దానికన్నా ఈ రేటు 0.3శాతం పాయింట్లు తక్కువగా వుంటుంది. వాణిజ్య ఉద్రిక్తతలు, అంతర్జాతీయ అనిశ్చితి అధిక స్థాయిలో నెలకొనడమే ఇందుకు కారణంగా వుంది.” అని ఐఎంఎఫ్‌ పేర్కొంది. వాణిజ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లడంతో విధానపరమైన అసందిగ్ధత కూడా చాలా ఎక్కువగా వుందని డబ్ల్యుఇఓ నివేదిక పేర్కొంది.
ఈ అంచనాల కింద అంతర్జాతీయ వృద్ధిరేటు కూడా 2024లో అంచనా వేసిన 3.3శాతం నుండి 2025లో 2.8శాతానికి పడిపోతుందని పేర్కొంది. అంటే జనవరిలోని అంచనాల కన్నా 0.5శాతం పాయింట్లు క్షీణించింది. 2026లో మూడు శాతం మేరా (అంటే జనవరిలోని అంచనాల కన్నా 0.3శాతం పాయింట్లు తక్కువగా) కోలుకుంటుంది. దాదాపు అన్ని దేశాలకు సంబంధించి వృద్ధిరేటు అంచనాలు క్షీణించాయి.
స్థూలంగా అన్ని దేశాల వ్యాప్తంగా ఇదే క్షీణతలు నమోదవుతున్నాయి. పెరుగుతున్న అనిశ్చితి, క్షీణిస్తున్న సెంటిమెంట్‌ వంటి కారణాల వల్ల కొత్తగా తీసుకునే వాణిజ్య చర్యల ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలు చాలా ప్రాంతాల్లో, దేశాల్లో ప్రతిబింబిస్తున్నాయని ఐఎంఎఫ్‌ పేర్కొంది.
సాపేక్షంగా అనుకూలమైన జనాభాతో భారత్‌లో 2025-50 మధ్య కాలంలో వృద్ధిరేటు చాలా తక్కువగానే అంటే 0.7 పర్సంటేజ్‌ పాయింట్లు మేరా క్షీణిస్తుందని ఐఎంఎఫ్‌ నివేదిక అంచనా వేసింది. అయితే, 2050-2100 మధ్య కాలంలో జనాభా పరంగా కీలకమైన మలుపు సంభవించే అవకాశమున్న నేపథ్యంలో ఈ క్షీణత ఇంకా ఉధృతమవుతుందని పేర్కొంది. 2026 ఆర్థిక సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) వృద్ధిరేటు 6.3-6.8శాతం మధ్య వుంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. కాగా 2025 ఆర్థిక సంవత్సరారిని జిడిపి వృద్ధిరేటు 6.5శాతంగా వుంటుందని గణాంకాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అమెరికా కొత్తగా టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో గత వారం భారత్‌ జిడిపి వృద్ధిరేటుకు సంబంధించి మూడీ రేటింగ్స్‌ తన అంచనాలను సవరించింది. తొలుత 2025 ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరిలో 6.6శాతం వుంటుందని పేర్కొంది. ప్రస్తుతం దాన్ని 5.5-6.5శాతం మధ్యకు సవరించింది. ఈ టారిఫ్‌ల వల్ల ప్రాంతీయ ఎగుమతులకు డిమాండ్‌ పెరుగుతుందని, అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలపై ప్రభావం వుంటుందని, వ్యాపార, వాణిజ్య వర్గాల విశ్వాసం దెబ్బతింటుందని పేర్కొంది. ఫలితంగా ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో పెట్టుబడులు క్షీణిస్తాయని తెలిపింది.
ఫిచ్‌ రేటింగ్స్‌ కూడా 2026ఆర్థిక సంవత్సరానికి భారత్‌ వృద్ధిరేటు అంచనాలను సవరించింది. మార్చితో పోలిస్తే పది బేసిస్‌ పాయింట్లు తగ్గించి 6.4శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img