Thursday, May 22, 2025
Homeతాజా వార్తలుప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి

ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి

- Advertisement -

– అందరికీ నాణ్యమైన, సమానమైన విద్యనందించాలి
– ఫీజు బకాయిలు విడుదల చేయాలి
– ఇంటిగ్రేటెడ్‌ గురుకులాలను వ్యతిరేకిస్తున్నాం
– ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలి
– ఎన్‌ఈపీని అమలు చేస్తోన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం
– విద్యా కేంద్రీకరణతో రాష్ట్రాల హక్కులు హరిస్తోన్న కేంద్రం
– సమస్యల పరిష్కారానికి చలో హైదరాబాద్‌
– నవతెలంగాణతో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు డిమాండ్‌ చేశారు. విద్యార్థులందరికీ నాణ్యమైన, సమానమైన విద్యనందించాలని కోరారు. విద్యారంగంలో అంతరాలు పెరుగుతున్నాయనీ, వాటిని తగ్గించడంపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ-2020)ను అమలు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యాకేంద్రీకరణ చేస్తున్నదని అన్నారు. రాష్ట్రాల హక్కులను హరిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం విధానాలను వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వాలకు నిధుల్లో కోత విధిస్తున్నదని వివరించారు. విద్యారంగం, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఐదో మహాసభలు ఈనెల 25, 26, 27 తేదీల్లో ఖమ్మంలో జరుగుతున్న సందర్భంగా నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు టి నాగరాజు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు…
విద్యారంగం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మీ వైఖరేంటీ?
విద్యారంగంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. 2014లో మోడీ అధికారంలోకి వచ్చాక విద్యాకాషాయీకరణ వైపు అడుగులు వేస్తున్నారు. విద్యారంగంలోకి మతోన్మాద విధానాలను తెస్తున్నారు. అందులో భాగంగానే విద్యా కార్పొరేటీకరణ, వ్యాపారీకరణ, ప్రయివేటీకరణ కోసం నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ-2020)ను తెచ్చారు. విద్యారంగం స్వరూపాన్ని మార్చేందుకు కుట్ర చేస్తున్నారు. యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీఈఆర్టీ వంటి కీలకమైన వాటిలో ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధం ఉన్న వారినే నియమిస్తున్నారు. అందులో భాగంగానే స్వాతంత్య్ర సమరయోధుల పాఠ్యాంశాలను తొలగింపు, సిలబస్‌ను మారుస్తున్నారు. విద్యారంగాన్ని కేంద్రీకృతం చేస్తున్నారు.
రాష్ట్రాల హక్కులను మోడీ ప్రభుత్వం హరిస్తున్నది. విద్యారంగాన్ని పూర్తిగా కేంద్రం గుప్పిట్లోకి తీసుకుంటున్నది. కేంద్రం విధానాలను, ఎన్‌ఈపీని వ్యతిరేకించిన రాష్ట్రాలకు నిధులు ఇవ్వడం లేదు. ఎన్‌ఈపీని అమలు చేస్తేనే సమగ్ర శిక్ష నిధులు, మధ్యాహ్న భోజన పథకం నిధులను తమిళనాడు ప్రభుత్వానికి ఇస్తామంటూ కేంద్రం షరతు విధించడమే ఇందుకు నిదర్శనం. అదానీ, అంబానీలకు విశ్వవిద్యాలయాలను కట్టబెట్టడం, విదేశీ యూనివర్సిటీలను తెస్తున్నది. విద్యా ప్రయివేటీకరణను ప్రోత్సహిస్తున్నది. దానివల్ల ఉన్నత విద్యలోకి పేద విద్యార్థులు రాలేకపోతున్నారు. తద్వారా డ్రా పౌట్లు పెరుగుతున్నారు. విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో అధ్యాపక పోస్టులను సకాలంలో భర్తీ చేయడం లేదు. విద్యార్థులకు ఫెలోషిప్‌లు ఇవ్వడం లేదు. పరిశోధనలు కుంటుపడుతున్నాయి. కార్పొరేట్‌ సంస్థలకు అవసరమైన కోర్సులను ప్రవేశపెడుతున్నారు. దానివల్ల పేద విద్యార్థులు చదవలేకపోతున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన పట్ల మీ అభిప్రాయమేంటీ?
పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ విద్యారంగాన్ని ధ్వంసం చేసింది. గురుకులాలను ప్రారంభించినా వాటిని అద్దె భవనాలకే పరిమితం చేసింది. విద్యారంగానికి కనీసం అవసరమైన నిధులనూ కేటాయించలేదు. సకాలంలో ఉపాధ్యాయ ఖాళీలనూ భర్తీ చేయలేదు. కాంట్రాక్టు అధ్యాపకులతోనే విశ్వవిద్యాలయాలు నడుస్తున్నాయి. 2013 నుంచి వర్సిటీల్లో అధ్యాపక పోస్టులను భర్తీ చేయలేదు. బీఆర్‌ఎస్‌ హయాంలో కేవలం 8,792 ఉపాధ్యాయ పోస్టులను మాత్రమే భర్తీ చేసింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది. విద్యాకమిషన్‌ను నియమించింది. అయితే విద్యారంగాన్ని కేంద్రీకరించేలా నిర్ణయాలు తీసుకుంటున్నది. విద్యా కమిషన్‌ సిఫారసు మేరకు రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ ఫౌండేషన్‌ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నది. చుట్టుపక్కల గ్రామాల పిల్లలను అక్కడికి తెచ్చి చదివించేలా ప్రయత్నం చేస్తున్నది. గ్రామాల్లో ప్రభుత్వ బడులను మూసివేసి మండలంలోని రెండూ మూడు చోట్ల పాఠశాలలను తెరిచి ఒకే దగ్గర ఎక్కువ మంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దానివల్ల విద్యారంగం కేంద్రీకృతం అవుతుంది. ఇది ఎన్‌ఈపీలో భాగమే.
స్కిల్‌ యూనివర్సిటీతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయంటారా?
రాష్ట్ర ప్రభుత్వం స్కిల్‌ యూనివర్సిటీని ప్రారంభించింది. దానికి కార్పొరేట్‌ అధిపతి ఆనంద్‌ మహీంద్ర చైర్మెన్‌గా ఉన్నారు. కార్పొరేట్‌ సంస్థల నుంచి నిధులను సేకరిస్తున్నారు. అక్కడ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి అదానీ, అంబానీ వంటి కార్పొరేట్‌ సంస్థల్లో ఉపాధి కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా కోర్సులను ప్రవేశపెట్టడం ప్రమాదకరం. దానివల్ల ప్రభుత్వ విద్యారంగం బలహీనపడుతుంది. ప్రభుత్వం విద్యారంగం బాధ్యత నుంచి తప్పుకునే ప్రమాదముంటుంది. స్కిల్‌ యూనివర్సిటీతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు వచ్చేది స్వల్పమే. అందులోనూ కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాలే నెరవేరుతాయి.
విద్యారంగానికి కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమలు పట్ల ఏమంటారు?
మండలానికి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రారంభిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఏడాదిన్నర దాటినా ఆ ఊసేలేదు. విద్యా భరోసా కార్డు ప్రస్తావన లేదు. విద్యారంగానికి 15 శాతం నిధులను కేటాయిస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించారు. కానీ ప్రస్తుత బడ్జెట్‌లో 7.57 శాతం నిధులను మాత్రమే కేటాయించింది. విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్‌ కోర్సులను సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులుగా మారుస్తు న్నారు. రాష్ట్రంలో రూ.8,253 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌ షిప్‌ నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. పరీక్షలను నిర్వహించబోమంటూ విద్యా సంస్థలే ప్రకటించే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి అధ్వా నంగా ఉన్నది. పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత ఉన్నది. యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు సకాలంలో రావడం లేదు. సంక్షేమ హాస్టళ్లు సమస్యల్లో ఉన్నాయి. గురుకులాలకు సొంత భవనాల్లేవు. కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లలో సమస్యలున్నాయి. విద్యారంగానికి సరిపోను నిధులివ్వకుండా, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నది. ఖాళీ పోస్టులను భర్తీ చేయడం లేదు. విద్యారంగ అభివృద్ధికి చర్యలు చేపట్టాలి. రాష్ట్రంలో నాలుగు వేల ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. 1,800 బడులను మూసివేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుతోపాటు ఇంగ్లీష్‌ మీడియంలో బోధన సాగించాలి.
మీ భవిష్యత్‌ కార్యాచరణ ఎలా ఉండబోతుందంటారు?
విద్యారంగ అభివృద్ధిపై సమగ్రంగా చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తాం. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తాం. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. పెరిగిన ధరలకనుగుణంగా మెస్‌చార్జీలను పెంచాలి. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి విద్యార్థులకు సమస్యల్లేకుండా చూడాలి. పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్‌ మెంట్‌, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలి.
రాష్ట్ర మహాసభలో ఏయే అంశాలను చర్చించబోతున్నారు?
అందరికీ నాణ్యమైన, సమానమైన విద్యను అందించాలి. ప్రభుత్వ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయాలి. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఇంజినీరింగ్‌, మెడికల్‌ కాలేజీలను ప్రారంభించాలి. మండలానికి ఒక ఇంటర్నేషనల్‌ పాఠశాలను మంజూరు చేయాలి. గురుకులాలకు సొంత భవనాలను నిర్మించాలి. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ గురుకులాలను వ్యతిరేకిస్తున్నాం. ఒకే ప్రాంగణంలో సుమారు ఐదు వేల మంది విద్యార్థులు ఉండడం సరైంది కాదు. ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలి. అందుకోసం చట్టం తేవాలి. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలను నిర్వహించాలి. ఈ అంశాలపై మహాసభల్లో చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంటాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -