నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలోని అనకాపల్లి బాణాసంచా పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలోని కైలాసపట్నంలో ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో ఆదివారం భారీ పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందగా.. మరో ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద ఘటనలోనే ఐదుగురు చనిపోగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు విశాఖ కేజీహెచ్ వైద్యులు తెలిపారు. కాగా ఈ భారీ అగ్నిప్రమాదంపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అదేవిధంగా మృతుల కుటుంబాలకు పీఎం సహాయనిధి నుంచి రూ.2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు రూ.50 వేలు అందివ్వనున్నట్టు వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామని హోంమంత్రి అనిత తెలియజేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులను, వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
బాణాసంచా ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి..
- Advertisement -
RELATED ARTICLES