Thursday, May 8, 2025
Homeజాతీయంబాధ్యత ఎవరిదీ?

బాధ్యత ఎవరిదీ?

- Advertisement -

– ఉగ్రదాడిపై అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాల నిలదీత
– కేంద్రానికి సంపూర్ణ మద్దతు
– మృతులకు సంతాపం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా వైఫల్యాల బాధ్యత ఎవరిదని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. భద్రతా లోపానికి గల కారణాలేంటో తెలుసుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు పూర్తి మద్దతునిస్తున్నట్టు స్పష్టం చేశాయి. గురువారం పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌లో పహల్గాం ఉగ్రదాడిపై అఖిల పక్ష సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షత వహించారు. తొలుత పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన అమాయక ప్రజలకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
సమావేశానంతరం ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఖండించాయని, అవసరమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వానికి పూర్తి మద్దతునిచ్చాయని అన్నారు. ఆప్‌ ఎంపీ సంజరు సింగ్‌ మాట్లాడుతూ ”దేశం మొత్తం ఈ ఘటనపై కోపంగా, విచారంగా ఉంది. దేశం, కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులకు వారి భాషలో తగిన సమాధానం ఇవ్వాలని కోరుకుంటోంది. వారు అమాయక ప్రజలను చంపిన విధంగా వారి శిబిరాలను నాశనం చేయాలి. పాకిస్తాన్‌పై కూడా చర్యలు తీసుకోవాలి. ఈ సంఘటన ఏప్రిల్‌ 22న జరిగింది. ఏప్రిల్‌ 20న ఆ స్థలాన్ని తెరిచారు. భద్రతా సంస్థలకు ఎటువంటి సమాచారం లేదు. జవాబుదారీ ఎవరనేది నిర్థారించాలి. భద్రతా లోపం ఎందుకు జరిగిందో చర్య తీసుకోవాలని మేము డిమాండ్‌ చేశాం” అని అన్నారు. టీఎంసీ ఎంపీ సుదీప్‌ బందోపాధ్యాయ మాట్లాడుతూ ” భద్రతా లోపాలపై చర్చించాం. దేశ ప్రయోజనాల కోసం ఏ నిర్ణయాలు తీసుకున్నా ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా నిలుస్తాయని మేము ప్రభుత్వానికి హామీ ఇచ్చాం” అని అన్నారు. కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు మాట్లాడుతూ ”పహల్గాంలో జరిగిన ఘటన గురించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ క్యాబినెట్‌ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ (సీసీఎస్‌) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తెలియజేశారు. ఈ సంఘటన చాలా విచారకరం. దీని కారణంగా దేశంలోని ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కూడా మరింత కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేసింది” అని అన్నారు. ఈ ఘటన కాశ్మీర్‌లోని ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసిందని, అందరూ దీనిపై తమ ఆందోళనను వ్యక్తం చేశారని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను స్పష్టం చేశాయని, దేశం ఐక్యంగా నిలబడాలని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒకే గొంతుతో మాట్లాడాలనే ఏకాభిప్రాయం అన్ని రాజకీయ పార్టీల్లో ఉందని తెలిపారు.
ఈ సమావేశంలో కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్‌ షా, విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, సీపీఐ(ఎం) ఎంపీ బికాష్‌ రంజన్‌ భట్టాచార్య, ఎన్‌సీపీ ఎంపీ ప్రఫుల్‌ పటేల్‌, ఎన్‌సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే, ఎస్పీ ఎంపీ రామ్‌ గోపాల్‌ యాదవ్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజరు సింగ్‌, ఆర్‌జేడీ ఎంపీ ప్రేమ్‌ చంద్‌ గుప్తా, టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు, వైసీపీ ఎంపీ పీవీ మిధున్‌ రెడ్డి, టీఎంసీ ఎంపీ సుదీప్‌ బందోపాధ్యాయ, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, బీజేడీ ఎంపీ సస్మిత్‌ పాత్ర, శివసేన (షిండే) ఎంపీ శ్రీకాంత్‌ షిండే తదితరులు పాల్గొన్నారు.
ఔను నిజమే..
భద్రతా లోపాలను అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం
ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో భద్రతా లోపాలను కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఉగ్ర దాడిపై గురువారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్ష నేతలతో సీనియర్‌ కేంద్ర మంత్రి పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ”ఏ తప్పు జరగకపోతే, మనం ఇక్కడ ఎందుకు కూర్చొంటాం? మనం కనుగొనాల్సిన చోట లోపాలు ఉన్నాయి. భద్రతా వైఫల్యానికి కారణాలు తెలుసుకోవాలి” అని కేంద్ర మంత్రి అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడి తరువాత ప్రతిపక్ష నాయకులకు వివరించడానికి ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో అనేక ప్రతిపక్ష పార్టీల నేతలు భద్రతా, ప్రోటోకాల్‌ వైఫల్యం గురించి ప్రశ్నలు అడిగారు. ”భద్రతా దళాలు ఎక్కడ ఉన్నాయి? సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ ఎక్కడ ఉంది?” అని ప్రశ్నించారు. దీనికి ప్రతి స్పందిస్తూ సీనియర్‌ కేంద్ర మంత్రి అనంత్‌నాగ్‌ జిల్లాలోని పహల్గాం సమీపంలోని బైసరన్‌ ప్రాంతాన్ని తెరవడానికి ముందు స్థానిక అధికారులు భద్రతా సంస్థలకు సమాచారం ఇవ్వలేదని ప్రభుత్వం చెప్పినట్టు తెలుస్తోందని అన్నారు. ఇది సాంప్రదాయకంగా జూన్‌లో అమర్‌నాథ్‌ యాత్ర వరకు పరిమితం చేయబడిందని తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ సంఘటనపై ఆలస్యంగా స్పందించడంపై కూడా ప్రతిపక్ష నేతలు ఆందోళనలు వ్యక్తం చేశారు. దీనికి స్పందిస్తూ ఆ ప్రదేశం 45 నిమిషాల ఎత్తుపైకి నడిచే దూరంలో ఉందని, అటువంటి అత్యవసర పరిస్థితులను త్వరగా నిర్వహించడానికి ఎటువంటి ప్రామాణిక ఆపరేటింగ్‌ విధానం (ఎస్‌ఓపీ) అమలులో లేదని ప్రభుత్వ అధికారులు వివరించారు.
భద్రతాపరమైన సందేహాలెన్నో..!
– పుల్వామా దాడి రిపోర్టు ఎక్కడుంది..
– కేంద్రం నేర్చుకున్న గుణపాఠం ఏంటీ..?
– సీపీఐ(ఎం) ఎంపీ బికాష్‌ రంజన్‌ భట్టాచార్య
కేంద్రప్రభుత్వానికి మద్దతునిస్తున్నామని, అయితే తమకు కొన్ని సందేహాలు ఉన్నాయని సీపీఐ(ఎం) ఎంపీ బికాష్‌ రంజన్‌ భట్టాచార్య అన్నారు. ఉగ్రవాద దాడి జరిగిన స్థానంలో ఒక్క భద్రతా సిబ్బంది లేకపోవడానికి కారణం ఎవరని ప్రశ్నించారు. ఇలా అనేక భద్రతాపరమైన సందేహాలు ఉన్నాయని తెలిపారు. వీటికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పుల్వామా దాడికి సంబంధించిన రిపోర్టు ఎక్కడుంది? దాని నుంచి ప్రభుత్వం ఎటువంటి గుణపాఠం నేర్చుకుంది? అని ప్రశ్నించారు. ప్రభుత్వం జింగోయిజాన్ని ఆపాలని సూచించారు. అలాగే దాడి జరిగిన తరువాత జమ్మూకాశ్మీర్‌తో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు ముక్తకంఠంతో ఖండించారని గుర్తు చేశారు. ఉగ్రవాదాన్ని వ్యతిరేకించారని తెలిపారు. కానీ కాశ్మీర్‌ ప్రజలకు వ్యతిరేకంగా కొంత మంది ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నారని, దీనికి అడ్డుకట్ట వేయాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -