Wednesday, April 30, 2025
Homeజాతీయంబిక్కుబిక్కుమంటున్న పర్యాటకులు

బిక్కుబిక్కుమంటున్న పర్యాటకులు

– ఉగ్రదాడి నేపథ్యంలో కాశ్మీరీల ఉదారత
– టూరిస్టులకు ఫ్రీగా ఆటో, ట్యాక్సీ రైడ్లు
శ్రీనగర్‌: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం.. అక్కడున్న పర్యాటకులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. వారికి అక్కడి వ్యాపారులు, స్థానికులు తమ తోచిన సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఆటో రిక్షాలు, ట్యాక్సీ డ్రైవర్లు ఎలాంటి చార్జీలు లేకుండా ఉచితంగానే వారి గమ్య స్థానాలకు చేరుస్తున్నారు. అధిక ధరల నేపథ్యంలో ఉచితంగా ఆవాసం కల్పిస్తున్నారు
వారు మాకు అతిథులు… అందుకే సురక్షితంగా ఎయిర్‌పోర్టు వద్ద దింపా : బిలాల్‌ అహ్మద్‌?, ఆటో డ్రైవర్‌
”ఇది కేవలం పర్యాటకుల మీద జరిగిన దాడి మాత్రమే కాదు. కాశ్మీర్‌ ఆత్మపై జరిగిన దాడిగా భావించాలి. వారంతా మాకు అతిథులుగా వచ్చారు. కానీ ఇప్పుడు వారంతా భయంతో వెళ్తున్నారు. ఇది మాకు చాలా బాధగా అనిపిస్తుంది. నవ దంపతులు భయంతో వణుకుతూ వచ్చి ఎయిర్‌పోర్ట్‌కు ఎలా వెళ్లాలి అని అడిగారు. వారికి ఎవరిని నమ్మాలో కూడా అర్థం కావట్లేదు. దీంతో మీరు భద్రంగా ఉన్నారు…భయపడకండి అని చెప్పా. వారిని సురక్షితంగా ఎయిర్‌పోర్ట్‌ వద్ద వదిలా. వారు డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ అలాంటి పరిస్థితుల్లో వారి నుంచి నేను డబ్బులు ఎలా తీసుకోగలను?”
పర్యాటకులకు ఓపెన్‌ హౌమ్స్‌
శ్రీనగర్‌కు చెందిన డాక్టర్‌ కూడా తన మంచి మనసును చాటుకుంటున్నారు. తన ఇంటినే హౌటల్‌గా మార్చి పర్యాటకులకు ఉచితంగా ఆవాసాన్ని కల్పిస్తున్నారు. అధిక ధరలు, హైవే మూసివేత కారణంగా ఇబ్బంది పడుతున్న పర్యాటకులు తమ ఇంటిని ఉపయోగించుకోవచ్చని డాక్టర్‌ ఇరాన్‌ తెలిపారు.
హౌటల్‌ బుకింగ్స్‌ రద్దు
ఉగ్రదాడితో పహల్గాంలో ఉన్న పర్యాటకులు హౌటళ్లను ఖాళీ చేశారు. దాదాపు 95శాతం మంది హౌటళ్లు ఖాళీ చేసి వెళ్లినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. సుమారు నెల వరకు హౌటల్స్‌ బుకింగ్స్‌ అయ్యాయని, కానీ ఇప్పుడు వారంతా రద్దు చేసుకున్నట్టు చెబుతున్నారు. పహల్గాంలో దాదాపు 400 హౌటళ్లు ఉంటాయని ఆ సంఘం అధ్యక్షుడు ముస్తాక్‌ తెలిపారు.
ప్రత్యేక విమానాలకు చర్యలు
ఇటీవల కొండచరియలు విరిగిపడడం వల్ల 44వ నంబర్‌ జాతీయ రహదారిని మూసివేశారు. ఫలితంగా పర్యాటకులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్నారు. దీంతో శ్రీనగర్‌ విమానాశ్రయం పర్యాటకులతో రద్దీగా మారింది. ఈ నేపథ్యంలోనే పర్యాటకుల భద్రత కోసం శ్రీనగర్‌ నుంచి ప్రత్యేక విమాన సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు వెల్లడించారు. నాలుగు ప్రత్యేక విమానాలు శ్రీనగర్‌ నుంచి ముంబయి, ఢిల్లీకి చేరుకుంటాయని, దీనిపై మంగళవారం హౌంమంత్రి అమిత్‌ షాతో మాట్లాడినట్టు రామ్మోహన్‌నాయుడు చెప్పారు. అవసరమైతే మరిన్ని విమానాలు నడపడానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇందులో భాగంగా అన్ని విమానయాన ఆపరేటర్లతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ కష్ట సమయంలో ప్రయాణికులపై భారం పడకుండా, సాధారణ స్థాయి ఛార్జీలను వసూలు చేయాలని విమానయాన సంస్థలను మంత్రి ఆదేశించారు. మరణించిన వ్యక్తుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ పూర్తి సహకారాన్ని అందించాలని కోరారు.
చిక్కుకుపోయాం.. స్వస్థలాలకు పంపండి
ప్రభుత్వానికి తెలంగాణ పర్యాటకుల విజ్ఞప్తి
పహల్గాం ఉగ్రదాడితో కాశ్మీర్‌కు వెళ్లిన పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. భద్రతా దళాలు అప్రమ్తతమై భరోసా ఇస్తున్నా వారు మాత్రం వణికిపోతున్నారు. అక్కడున్న వారిలో తెలంగాణ పర్యాటకులు 80 మంది ఉన్నారు. వీరంతా ప్రస్తుతం శ్రీనగర్‌లోని ఓ హౌటల్‌లో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్‌ పర్యాటక ప్రాంతాల్లో విహరించేందుకు రాష్ట్రంలోని హైదరాబాద్‌, మెదక్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండకు చెందిన వారు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీనగర్‌ చేరుకున్నారు. ఉగ్రదాడితో కర్ఫ్యూ విధింపుతో హౌటల్‌లోనే ఉండిపోయారు. షెడ్యూల్‌ ప్రకారం బుధవారం వీరు పహల్గాం పర్యటనకు వెళ్లాల్సి ఉంది. తిరిగి ఈనెల 26న టూర్‌ ముగించుకుని స్వస్థలాలకు రావాలని ప్లాన్‌ చేసుకున్నారు. ఉగ్రదాడితో పర్యాటకులందరూ శ్రీనగర్‌లోనే ఉండిపోయారు. ”మేము తెలంగాణ నుంచి 80 మంది టూర్‌ కోసం వచ్చాము. నిన్న మేము ఇక్కడికి చేరుకోగానే దాడి జరిగింది. మమల్ని బయటకు ఎటూ వెళ్లనివ్వడం లేదు. దయచేసి మమ్మల్ని ఇక్కడి నుంచి రాష్ట్రానికి తీసుకెళ్లండి.” అని తెలంగాణ వాసులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img