Monday, May 26, 2025
Homeట్రెండింగ్ న్యూస్బీఆర్‌ఎస్‌లో కవిత కల్లోలం

బీఆర్‌ఎస్‌లో కవిత కల్లోలం

- Advertisement -

– ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌, కేటీఆర్‌ తర్జనభర్జన
– ఈ ఎపిసోడ్‌ను ఎలా డీల్‌ చేద్దాం?
– ‘ఆ నలుగురి’పైనే అనుమానం
– ఇద్దరు బీజేపీ ఎంపీల విజయానికి కేటీఆర్‌, హరీశ్‌రావే కారణమంటూ ఆరోపణలు
– తనదారి తాను చూసుకొనే పనిలో కవిత
– జూన్‌ 9న కొత్త పార్టీ ఆవిర్భావం?
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖ లీకు ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)లో కల్లోలం రేపుతోంది. మే2న రాసిన లేఖ ఇప్పుడు లీకు కావడంతో ఒకవైపు కేసీఆర్‌, కేటీఆర్‌, మరోవైపు కవిత కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతర్గతంగా పార్టీ అధ్యక్షుడికి రాసిన లేఖను మీడియాకు విడుదల చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కేటీఆర్‌ ఆదివారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో భేటీ అయ్యారు. కవిత అంశం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాఫిక్‌గా మారింది. ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలపై తండ్రి కొడుకు మధ్య తీవ్రంగా చర్చ జరిగినట్టు సమాచారం. కవిత లేఖ, శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద ఆమె వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కింద షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలా? వద్దా? అనే దానిపై ఇరువురూ మాట్లాడుకున్నారని ప్రచారం జరుగుతున్నది. కవిత సొంత కుటుంబ సభ్యురాలు కావడంతో వేచి చూసే ధోరణిని అవలంభించాలని కేసీఆర్‌ అభిప్రాయపడినట్టు తెలిసింది. అలాగే జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపైనా వారిద్దరూ చర్చించారు. అదే సమయంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కేటీఆర్‌ అమెరికాలో జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తున్నట్టు సమాచారం ఇచ్చారని తెలిసింది. పార్టీపై కవిత తిరుగుబాటు చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్‌ ఆమెరికా పయనంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నెల రోజులకు ముందే అమెరికా ప్రయాణం ఖరారైందని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.


లీకు వీరులు ఆ నలుగురే…
పార్టీ అధ్యక్షుడికి మే 2వ తేదీ లేఖ రాసిన విషయం వాస్తవమేనని స్వయంగా ఎమ్మెల్సీ కవిత ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ లేఖను మీడియాకు లీకు చేసింది ఎవరనే దానిపై చర్చ జరుగుతున్నది. ‘ఆ నలుగురే’ ఈ లీకుకు కారకులనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ కుటుంబ సభ్యుల కంటే కేసీఆర్‌ చుట్టూ ఆ కోటరీ బలంగా పని చేస్తున్నదనే అసంతృప్తిలో కవిత ఉన్నారని సమాచారం. మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బేతి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిల బృందంలో ఎవరో ఒకరు తన లేఖను లీకు చేశారని కవిత అనుమానపడుతున్నారని విశ్వసనీయ సమాచారం. పార్టీలో కోవర్టులుగా మారి ఇతర పార్టీలకు సహకరిస్తున్నారని ఇప్పటికే ఆమె ఆరోపించారు. వివిధ సందర్భాల్లో కేటీఆర్‌, హరీశ్‌రావు పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయనీ, పార్టీలో తన సేవలను గుర్తించడం లేదని ఆమె భావిస్తున్నారని తెలిసింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ పదవిని తనకు ఇవ్వాలని చాలా కాలంగా కవిత కోరుతున్నట్టు తెలిసింది. ఈ విషయంలో పార్టీ అధిష్టానం కూడా ఉలుకూ, పలుకూ లేకుండా వ్యవహరిస్తుండటాన్ని ఆమె తప్పుపడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.


జూన్‌ 9న కొత్త పార్టీ?
బీఆర్‌ఎస్‌తో కవిత తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. జూన్‌ 9న కవిత నేతృత్వంలో కొత్త పార్టీ ఆవిర్భ వించబోతున్నట్టు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఇప్పటికే పార్టీ జెండా కూడా సిద్ధమైనట్టు తెలిసింది. మెదక్‌, నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించడం వెనుక కేటీఆర్‌, హరీశ్‌రావు ఉన్నట్టు కవిత ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీనిపై ఎన్నో సార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా సమాధానం చెప్పలేదనే టాక్‌ వినిపిస్తున్నది. కొంతకాలంగా బీఆర్‌ఎస్‌లో కవిత అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. సొంత అజెండా సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్న ట్లు ప్రచారం జరుగుతున్నది. లిక్కర్‌ కుంభకోణంలో జైలుకెళ్లొ చ్చిన తర్వాత… ఆమెకు, కేటీఆర్‌కు మధ్య విభేదాలు తీవ్రస్థాయి కి చేరాయని భావిస్తున్నారు. జైలు నుంచి వచ్చాక కవిత తన ఇంటినే రాజకీయ వేదికగా మార్చారు. బీసీ రిజర్వేషన్లు, కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలపై స్పందించారు. రిజర్వేషన్లపై ధర్నా చౌక్‌ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. పార్టీ వైఖరి ఏదైనా ఆమె మాత్రం బీసీలకు రిజర్వేషన్లపై తన గళాన్ని వినిపించారు. పార్టీతో సంబంధం లేకుండా పార్టీకి సమాంతరంగా ఆమె సొంతంగా కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భం దొరికినప్పుడల్లా తన బలాన్ని చూపించే ప్రయత్నం చేశారు. పార్టీలో ఆమెకు సరైన ప్రాధాన్యం లేకపోవడం వల్లే సొంతంగా కార్యక్రమాలు చేపట్టారన్న అభిప్రాయాలూ బీఆర్‌ఎస్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -