నవతెలంగాణ-హైదరాబాద్: న్యాయవ్యవస్థపై ఉపరాష్ట్రపతి సహా పలువురు బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. ప్రస్తుతం తాము కార్య నిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నామంటూ సోమవారం వ్యాఖ్యానించింది. ముర్షిదాబాద్ అల్లర్ల కేసు నేపథ్యంతో.. పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన(Bengal President Rule) విధించాలని కోరుతూ విష్ణు శంకర్ జైన్ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో జస్టిస్ గవాయ్ పిటిషన్‌ను పరిశీలిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘మేం ఇప్పటికే కార్య నిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాం. ఇలాంటి తరుణంలో.. బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని, సైన్యాన్ని మోహరింపజేయాలని మాండమస్ రిట్ ప్రకారం రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా?’’ అని పిటిషనర్ లాయర్‌ను ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పిటిషనర్ కోరిన ఆదేశాలు జారీ చేయడానికి బెంచ్ నిరాకరించింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రాలు రూపొందించే బిల్లుల విషయంలో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరును సుప్రీం కోర్టు తప్పుబడుతూ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో గవర్నర్, రాష్ట్రపతికి సైతం కాలపరిమితి విధించింది. ఈ వ్యవహారంలో రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక అధికారాలు పని చేయబోవని.. ఒకవేళ ఆ కాలపరిమితిని ఉల్లంఘిస్తే కోర్టులను ఆశ్రయించొచ్చని రాష్ట్రాలకు సూచించింది. అదే సమయంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లనూ విచారిస్తూ.. స్టే ఆదేశాలు జారీ చేసింది.
బీజేపీ నేతల వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు స్పందన
- Advertisement -
RELATED ARTICLES