Tuesday, April 29, 2025
Navatelangana
Homeనేటి వ్యాసంబౌద్ధం..ఓ జీవన మార్గం…

బౌద్ధం..ఓ జీవన మార్గం…

- Advertisement -

బౌద్ధాన్ని కొంత మంది మతంగా పరిగణిస్తారు. మరి కొంతమంది ‘దర్శనం’ అంటారు. నిజానికి అదొక జీవన విధానం. ఏ పేరుతో పిలిచినా దాని ధర్మం మారదు. అందువల్ల బౌద్ధాన్ని బౌద్ధం అని అంటే సరిపోతుంది. సర్వ మానవ సంక్షేమం కోసం, మానవాళిని ద్ణుఖ విముక్తులను చేయడం కోసం సిద్ధార్థుడు రాజ్యాన్ని, రాజభోగాల్ని, సంసార సుఖాలను త్యజించి, త్యాగం అంటే ఏమిటో ఆచరణాత్మకంగా చేసి చూపాడు.అంతులేని ధనరాసులతో పొందలేని ఆత్మజ్ఞానం తనకు తానై సాధించుకోవ డానికి అడవులకు వెళ్లాడు. తనలో తాను అంతర్మధనం చెందాడు. తనలోకి తాను ప్రయాణించాడు. బాహ్య అంతర జీవితాన్ని విశ్లేషించుకున్నాడు. సమాధిలో కొన్నికొన్ని విషయాలు గ్రహించుకున్నాడు. తాను ఏది గ్రహించాడో దాన్నే ఇతరులకు బోధించాడు. తాను ఏది బోధించాడో, అక్షరాలా దాన్నే తను ఆచరించాడు.
బుద్ధుడి బోధనలు జీవితానికి హేతుబద్ధమైన, న్యాయబద్ధమైన, ద్దమ్మ బద్ధమైన శీల ప్రధానమైన వెలుగుబాటలయ్యాయి. శాంతంతో కోపాన్ని, సాత్వికతతో హింసను, సత్యంతో అహింసను, దానంతో భోగాన్ని జయించవచ్చని- చెప్పాడు. చెప్పడమే కాదు, చేసి చూపాడు. ప్రేమవల్లనే ద్వేషం నశిస్తుంద న్నాడు. మతమంటే ప్రాణులన్నింటి పట్ల సానుభూతి కలిగి ఉండడమేనని – అందరినీ ప్రేమించడమే మానవత్వమనీ నిరూపించాడు. అందువల్లనే గౌతముడు బుద్ధుడయ్యాడు.ఆయన చూపిన జీవన మార్గమే బౌద్ధం అయ్యింది.
బుద్ధుడు అంటే పాలిభాషలో జ్ఞానోదయమైనవాడు- అని ఆర్థం! సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా గుర్తించాలని తొలిసారి బుద్ధుడు చెప్పాడు. ద్ణుఖాన్ని పారద్రోలి సుఖ సంతోషాలతో జీవించాలంటే బుద్ధుణ్ణి ఒక మార్గదర్శిగా స్వీకరించాలి. ఎందుకంటే అప్పటికి ఈ మానవ సమాజానికి నైతిక విలువల గూర్చి, అహింస గూర్చి, సత్యమార్గం గూర్చి తెలియని దశలో ఏకాగ్రతతో తనలోకి తాను ప్రయాణిస్తూ, తన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని గమనిస్తూ, మానవ సమూహాల్ని అర్థం చేసుకుంటూ, వారి సమస్యల్ని విశ్లేషించుకుంటూ ఏకాగ్రతతో ధ్యానం చేశాడు కాబట్టి, క్రమక్రమంగా ఆయన కు ఒక్కొక్క విషయం అవగతమైంది. లోతుగా ఆలోచిస్తున్న కొద్దీ, అవగాహనా స్థాయి పెరిగింది. ఆయన కనుగొన్న జీవన మార్గాలు చాలా కచ్చితమైనవి అని ఆయనకు స్పష్టంగా తెలిసింది. అందుకే నిస్సంకోచంగా, ధైర్యంగా తన అనుచరులకు బోధించడానికి సిద్ధపడ్డాడు. తన గురించి, తను ఉన్న సమాజం గురించి, ప్రపంచం గురించి, ప్రకృతి గురించి కనుగొన్న అనేక కొత్త విషయాల వల్ల ఆయనకు జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానం కలగడాన్నే ‘జ్ఞానోదయం’గా మనం భావిస్తున్నాం. ఈ జ్ఞాన సముపార్జన కోసమే బుద్ధుడు తపస్సు చేశాడు. ఇది వైదిక రుషులు చేసిన తపస్సు లాంటిది కాదు. వాళ్లు- ఏదో ఓ దేవుణ్ణి ఊహించుకుని తపస్సు చేస్తారు. కొంత కాలానికి ఆ దేవుడు కనబడి, తమకు వరాలిచ్చాడని భ్రమిస్తుంటారు. ఇప్పటికీ కొందరికి దేవుడు కలలో కనబడి తమకు గుడి కట్టించమని అడుగు తుంటాడట! అది ఒక పిచ్చో లేక మానసిక వ్యాధో అయి ఉంటుంది తప్ప- నిజం కావడానికి ఆస్కారమే లేదు. బుద్ధుడి విషయంలో అలా జరగలేదు- ఆయన ఎవరినో ఉద్దేశించి తపస్సు చేయలేదు. ఎవరూ ఆయనకు ప్రత్యక్షం కాలేదు. కండ్లు మూసుకుని, సమాధిలో కూర్చొని అంతర్మధనం సాగించాడు. తనలోకి తాను ప్రయాణించడ మంటే అదే- ఆ మధనంలో ఆయన వివేకంలోంచి పుట్టుకొచ్చిన విషయాల్నే మనం జ్ఞానం అంటున్నాం. అంతకు ముందు ప్రపంచంలో వాడుకలో లేని అంశాల్ని బుద్ధుడు తొలిసారిచెపుతూ వచ్చాడు గనక, ప్రపంచం ఆయన్ను జ్ఞానో దయమైన వాడిగా పరిగణిం చింది – అంతే!
వైదిక ధర్మానికి సంబం ధించిన రుషులు ఎవరైనా సరే, సమాజం బాగుపడాలని తపస్సు చేశారా? తమ పక్కవాడి మేలు కోరుతూ చేశారా? లేదే? కేవలం స్వార్థ చింతనతో, తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే చేశారు కదా? ఏ పురాణంలోనైనా మనకు ఈ విషయమే కనిపిస్తుంది. అత్యంత శక్తిమంతుడిగా కావాలనో, సజీవంగా స్వర్గలోకం పోవాలనో, అక్కడ స్వర్గ సౌఖ్యాలు అనుభవించాలనో- ఇలా తమ స్వార్ధ ప్రయోజనాల కోసమే చేశారు కదా? ప్రపంచం, పర్యావరణం, సమాజం, మానవత్వం వంటి విషయాల గూర్చి మదనపడుతూ, వాటిని బాగు చేయడానికి, పునరుద్ధరించడానికి వైదిక రుషులు ఎప్పుడైనా ఎక్కడైనా తపస్సు చేశారా? ఈ ఒక్క విషయం జాగ్రత్తగా ఆలోచిస్తే చాలు, బౌద్ధానికి ఇతర మతాలకూ ఉన్న తేడా తెలిసిపోతుంది!
బుద్ధ ధమ్మం బోధించే సత్యమార్గాన్ని, నైతిక మార్గాన్ని, అహింసా మార్గాన్ని అనుసరించినట్లయితే, చెడు పనులు చేయకుండా ఎవరైనా సరే సమాజంలో మంచిని పెంచడానికి కృషిచేస్తారు. బుద్ధ ధమ్మం రాగద్వేషాల నుండి, మోహాల నుండి దూరంగా ఉంచుతుంది. జనన మరణాల చక్రభ్రమణం నుండి బయట పడేస్తుంది. ఇతర మతాలకూ బౌద్ధానికి ప్రాథమికంగా ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఉంది. ఇతర మతాలు; ఆత్మల్ని, పునర్థాల్ని, దేవుళ్లని, దెయ్యాలని నమ్ముతూ క్షణం భయపడుతూ అభద్రతా భావంలో బతుకులు వెళ్లబోయాలని చెపుతాయి. కానీ, బౌద్ధం అలా కాదు- పక్కవాడికి, రాగల తరాలవారికీ ఉపయోగపడే మంచిపనులు చేస్తూ, ప్రశాంతంగా, సంతృప్తిగా నిర్వాణం పొందాలని చెపుతుంది. మనసు పెట్టి సహృదయంతో అర్థం చేసుకుంటేనే దాని గొప్పతనం తెలుస్తుంది. అర్థం చేసుకోకుండా విమర్శలకు దిగే బుద్ధిహీనులు కూడా నిదానంగా సమయం తీసుకుని, విషయం అర్థం చేసుకుంటే తప్పకుండా వారి వివేకం మేల్కంటుంది! వాడుకలో అన్నింటితో పాటు బౌద్ధాన్ని కూడా ఒక మతంగా చెప్పుకుంటున్నారు కానీ, అది మతం కాదు. అదొక జీవ న మార్గం. ఇకపోతే, బౌద్ధంలోని శరణాలకు ఉన్న అర్థమేమిటో చూద్దాం!
బుద్ధం శరణం గచ్ఛామి
ధమ్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి.
బుద్ధం – ధమ్మం – సంఘం : ఈ మూడింటిని త్రిరత్నాలు అని అంటారు. అంటే మూడు రత్నాలు. వీటినే త్రిశరణాలు అని కూడా అంటారు.
బుద్ధం శరణం గచ్చామి – అని అంటే- మార్గదర్శి బుద్ధుడు గనక, మొదట ఆయన శరణులోకి వెళుతున్నాను అని చెప్పడం. అంతేకాదు, బుద్ధం – అంటే జ్ఞానం అని అర్థం. జ్ఞానం శరణులోకి వెళుతున్నాను అని చెప్పడం. ప్రతివారూ సత్యం పలకడం, అహింసను ఆచరించడం, శీలంతో అంటే నైతికతతో జీవించడం అవసరమని బౌద్ధధమ్మం చెపుతుంది. ధమ్మం శరణం గచ్ఛామి అంటే- బుద్ధుడు చెప్పిన ఆ ధమ్మ మార్గంలో నడుచు కుంటానని ప్రతిజ్ఞ బూనడం. బుద్ధ ధమ్మం శరణులోకి వెళుతున్నానని ప్రకటించడం. ఇక చివరిది సంఘం శరణం గచ్చామి. ఎవరికి వారు, ఒకరి ప్రమేయం లేకుండా బతకలేరు. బంధాలు, అనుబంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అవసరం అని బుద్ధుడు గ్రహిం చాడు. ఇతరుల సహాయ సహకారాలు తప్పక అవసరమౌతాయి గనక – సంఘం శరణం గచ్చామి అని అన్నాడు. అహింసా మార్గంలో పయనిస్తూ, రుజువర్తనంతో, శీలవంతులై ఉన్న సమూహం – అంటే, సంఘం శరణు కోరుతున్నాను- అని ప్రకటించడం.
సమాజానికి కీడు చేసే వారిని ఈ రోజుకు కూడా సంఘ విద్రోహ శక్తులనే అంటున్నాం. వారిని సంఘంలో భాగంగా పరిగణించం. చట్టానికి కట్టుబడి ఉన్నవారికే సంఘంలో గౌరవం దక్కుతుంది. అలాంటి నీతిమంతమైన సంఘాన్ని శరణు కోరుతున్నాను అని చెప్పడమే సంఘం శరణం గచ్చామి – అని అంటే – ఇక మనిషి బాధల్లో చిక్కుకుని, మనోవేదనకు గురై కష్టాలు పడుతున్నప్పుడు బౌద్ధం మాత్రమే సరైన దారి చూపగలడన్న విషయం ప్రపంచవ్యాప్తంగా రుజువైంది. ఇటీవల 20 నవంబర్‌ 2024నాడు వెలువడిన ఒక వార్త కూడా ఇదే విషయాన్ని బలపరిచింది. జెనీవాకు చెందిన ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఫర్‌ రిలిజియస్‌’ అండ్‌ స్పిర్చువల్‌ ప్రోగ్రెస్‌ (ఐసిఎఆర్‌యుఎస్‌) బౌద్ధానికి ”ప్రపంచంలోని ఉత్తమ మతం”- అవార్డు ప్రదానం చేసింది. ప్రపంచంలోని అన్ని మతాల మత పెద్దలు కలుసుకున్న రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఓటింగ్‌ జరిపి, ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సంస్థ సభ్యత్వం ఉన్నవారిలో బౌద్ధ భిక్షుల సంఖ్య తక్కువ. అయినా కూడా ఇతర మతాల మత పెద్దలు తమ తమ మతాలకు ఓట్లు వేసుకోకుండా, అత్యధికులు బౌద్ధానికి వేయడం వల్ల ప్రతిష్టాత్మకమైన ఈ అంతర్జాతీయ అవార్డు బౌద్ధానికి దక్కింది. ఇది ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే అయినా – ప్రపంచ పౌరులకు ఆనం దాన్నిచ్చే విషయం! మనచుట్టూ ఉన్న సమాజంలో కూడా ఈ విషయం గమనించొచ్చు. సమాజంలో బౌద్ధుల సంఖ్య స్వల్పం. అయినా కూడా ఇతర మతాల పౌరుల్లో బౌద్ధం పట్ల ఆసక్తిగలవారూ, ఆకర్షింప బడుతున్నవారు రోజురోజుకూ అధికమౌతున్నారు. డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ చూపిన బాటలో నడుస్తూ, బౌద్ధం స్వీకరిస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతూ ఉంది.
ఈ విశ్వంలో ప్రతిదీ కార్యకారణ సంబంధంతోనే జరుగుతూ ఉందని తొలిసారి చెప్పినవాడు బుద్ధుడు. ఆ రకంగా ఆయన వైజ్ఞానికులకే వైజ్ఞానికుడయ్యాడు. సాధారణ శకానికి ముందు, ఏ విజ్ఞాన శాస్త్రమూ అభివృద్ధి కార ముందే కేవలం తన నిశిత పరిశీలనతో ఆయన ఆవిషయం ప్రకటించాడు. విషయం ఏదైనా అది ప్రజలకు అర్థం చేయించాలంటే.. తప్పకుండా దాన్ని ప్రజల భాషలో చెప్పాలని నిర్ణయించింది- బుద్ధుడే. మానవీయ విలువలతో సమాజ నిర్మాణం జరగాలన్నది ఆయనే. ఎవరినో గుడ్డిగా అనుసరిం చగూడదని ఎవరికి వారే జ్ఞానదీపాలుగా విరాజిల్లాలని అభిలషించింది కూడా ఆయనే. ఆయన చెప్పిన విషయాలు ఈ 21వ శతాబ్దంలో కూడా నిత్యం మనకు అవసరమౌతున్నాయి. ఉదాహరణకు కొన్ని విషయాలు చూడండి. ప్రార్ధించేముందు విశ్వసిస్తున్నావా లేదా ఆలో చించుకోమన్నాడు. విశ్వాసం లేకుండా ప్రార్థన చేయడం వృధాయే కదా? నువ్వు ఎదుటివారికి ఏదైనా చెప్పాల నుకున్నప్పుడు-వారు చెప్పేది శ్రద్ధగా వినమన్నాడు. ఖర్చుపెట్టే ముందు నువ్వెంత సంపాదిస్తున్నావో గుర్తుంచు కోమన్నాడు. ఏదైనా చెప్పాలనుకున్నా, రాయాలనుకున్నా రెండుసార్లు ఆలోచించుకోవాలని చెప్పాడు. ప్రయత్నం విర మించుకునే ముందు రెండు మూడుసార్లు ప్రయత్నించి చూడమన్నాడు. మరణం తప్పదు. పునర్జన్మ లేదు. ఉన్న ఈ ఒక్క జీవితాన్ని మానవీయ విలువల్ని నిలుపుకుంటూ హాయిగా, హుందాగా జీవించడం నేర్చుకో- అని అన్నాడు. చాలా మామూలు విషయాలుగా కనిపిస్తున్నాయి కాని,క్రమశిక్షణ, నిబద్ధత లేని వారికి ఇవి చాలా కష్టమైన పనులే కదా?
గౌతమబుద్ధుడు ఎందుకు మహనీయుడంటే రాజాన్ని, రాజభోగాల్ని తృణప్రాయంగా వదిలేశాడు. భార్యా బిడ్డల్నే కాదు, అన్ని అనుబంధాల్ని వదిలి భిక్కు జీవితం గడిపాడు. జాతి, దయ, ఆర్ద్రతతో పాటు ధైర్యం పట్టుదల చూపాడు. మానసిక వేదనే కాదు, శారీరక శ్రమను కూడా అను భవించాడు. దేవదత్తుడు అనేకసార్లు చంపడానికి ప్రయత్నించినా, గౌతముడు నిర్మలత్వాన్ని మాత్రమే చూపాడు. బందిపోటు అంగుళీమాలను దూరం నుండి చూస్తేనే, కోసల రాజ్యం మొత్తం భయపడి వణికిపోయేది. అలాంటి వాణ్ణి ఒంటరిగా వెళ్లి ధైర్యం ప్రదర్శించాడు. అంతేకాదు, అనరహంతకుడిని భిక్కు సమాజంలో కలిపాడు. పరినిబ్బాణం పొందినప్పుడు కూడా ఆందోళన పడకుండా ప్రశాం తంగా వెళ్లిపోయాడు. అందువల్ల బుద్ధుడు తొలి మహనీయుడు కాక మరేమవుతాడూ?
వ్యాసకర్త: త్రిపురనేని రామస్వామి పురస్కార
తొలి అవార్డు గ్రహీత.

  • డాక్టర్‌ దేవరాజు మహారాజు

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు