నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్ ఎప్పుడూ తొందరపాటు ధోరణిలో చర్చలు జరపదు. ముఖ్యంగా దేశ ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి ఒప్పందానికి తొందరపడదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ సహా అనేక దేశాలపై పరస్పర సుంకాల అమలును 90 రోజుల పాటు విరామం ప్రకటించారు. ప్రస్తుతం అమెరికా, భారత్ మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ముగించడానికి ఈ చర్య పరిమిత ఉపశమనంగా అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి పై వ్యాఖ్యలు చేశారు. ఇటలీ-ఇండియా బిజినెస్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోరమ్‌లో మాట్లాడిన ఆయన.. ‘తమకు దేశ ప్రయోజనాలే తొలి ప్రాధాన్యత. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఒప్పందం ఖరారయ్యేలా చూస్తాం. పరిమిత సమయానికి ప్రేరేపితం అవడం ఉండదు. గన్ పాయింట్‌లో చర్చలు జరపము. పరిమిత సమయం అనేది చర్చలు తొందరగా జరిగేందుకు దోహదపడతాయి, కానీ దేశంతో పాటు ప్రజల ప్రయోజనాలను కాపాడుకోవడం ముఖ్యం. కాబట్టి ఏ ఒప్పందానికైనా తొందరపడేది లేద’ని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో యూఎస్, యూకే, యూరోపియన్ యూనియన్ సహా ఇతర దేశాలతో భారత వాణిజ్య చర్చలకు సంబంధించి గోయల్ అప్‌డేట్ ఇచ్చారు. ఇండియా ఫస్ట్ స్పూర్తితో వాణిజ్య చర్చలన్నీ సానుకూలంగా సాగుతున్నాయి. 2047 నాటికి అమృత్‌కాల్‌లో వికసిత్ భారత్‌కు మా మార్గాన్ని ఈ ఒప్పందాలు దోహదపడతాయన్నారు.
