– ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ గుటెరస్
జెనీవా: భారత్, పాకిస్తాన్‌లు సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కోరారు. ఈ విషయాన్ని ఆయన ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య పరిస్థితులను గుటెరస్ నిశితంగా పరిశీలిస్తున్నారనీ, పహల్గాం ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. జమ్ముకాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని సెక్రెటరీ జనరల్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ గురువారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. పౌరులపై దాడులు ఆమోదయోగ్యం కాదని అన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాలతో గుటెరస్ చర్చించారా అన్న ప్రశ్నకు డుజారిక్ సమాధానమిచ్చారు.భారత్, పాకిస్థాన్‌లతో ప్రత్యక్షంగా మాట్లాడలేదని, కానీ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని చెప్పగలనని అన్నారు. భారత్, పాక్ ప్రభుత్వాలు సంయమనం పాటించాలని, ఇరుదేశాల మధ్య పరిస్థితి మెరుగయ్యేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని గుటెరస్ కోరారని అన్నారు. సమస్యలను అర్థవంతమైన, పరస్పర చర్యలద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని తాము కోరుకుంటున్నామని అన్నారు.
భారత్, పాక్‌లు సంయమనం పాటించాలి
- Advertisement -
RELATED ARTICLES