నవతెలంగాణ – హైదరాబాద్: బెంగళూరులోని రాజ్‌భవన్ వెలుపల ఆదివారం మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. హెబ్బాల్ ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జుహైల్ అహ్మద్, తన భార్య వేధింపులు భరించలేక, ఆమెపై ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదని ఆరోపిస్తూ ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. జుహైల్ అహ్మద్ రాజ్‌భవన్ గేటు వద్దకు చేరుకుని, తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకున్నాడు. తన భార్య తనపై గృహహింస కేసు పెట్టిందని, తాను కూడా ఆమెపై ఫిర్యాదు చేయాలని ప్రయత్నించినా పోలీసులు పట్టించుకోవడం లేదని, అందుకే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నానని అతను గట్టిగా అరిచినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. “నా ఫిర్యాదు కూడా తీసుకోవాలని కోరినా పోలీసులు వినడం లేదు. నాకు చావే శరణ్యం” అని కేకలు వేస్తూ నిప్పంటించుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే, అక్కడే విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు. ఆపై అతడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. పోలీసులు జుహైల్ అహ్మద్‌ను అదుపులోకి తీసుకుని, వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జుహైల్ అహ్మద్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. కొంతకాలంగా కుటుంబ కలహాలు, భార్యతో న్యాయపరమైన వివాదాల కారణంగా అతను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని అధికారులు పేర్కొన్నారు. భార్యాభర్తల మధ్య ఉన్న వివాదాలు, అహ్మద్ చేసిన ఆరోపణలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
భార్య వేధిస్తోందని రాజ్‌భవన్ వద్ద టెక్కీ ఆత్మాహుతి యత్నం
- Advertisement -
RELATED ARTICLES