– రక్షిత కౌలుదారు, కాస్తుకాలం ఊసేలేని కొత్త చట్టం
– సమగ్ర భూ సర్వే నిర్వహించి, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి : రౌండ్ టేబుల్ సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భూభారతి తప్పులతడకగా ఉందనీ, సమగ్ర భూ సర్వే నిర్వహిస్తేనే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి జంగారెడ్డి అధ్యక్షతన ”భూభారతి చట్టం… భూసమస్యలన్నీ పరిష్కరిస్తుందా?” అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి చట్టం రైతులకు శాపంగా మారిందనీ, తాము అధికారంలోకి వస్తే కొత్త చట్టం తెస్తామని ఎన్నికల ముందు ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భూ భారతి చట్టాన్ని తెచ్చారని గుర్తు చేశారు. అయితే అందులో కూడా చిన్న, సన్నకారు రైతులకు న్యాయం జరిగే అంశాలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ధరణిలో కాస్తు కాలం తొలగించడం వల్ల తాతల, తండ్రుల కాలం నుంచి భూమిని సాగు చేసుకుంటున్న వారికి కాకుండా, పట్టాదారులంటూ దేశంలో లేని వారికి పాసు పుస్తకాలిచ్చారని విమర్శించారు. కాస్తుకాలం, రక్షిత కౌలుదారు చట్టంపై భూ భారతిలో సమాధానం లేదని పేర్కొన్నారు. సమగ్ర భూ సర్వే జరపకుండా భూధార్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సర్వే కోసం ఆరువేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి ప్రకటించడాన్ని తపుపట్టారు. ప్రయివేటు సర్వేయర్లు ఎవరికి డబ్బులిస్తే వారి వైపు మొగ్గు చూపుతారని ఆందోళన వ్యక్తం చేశారు. సర్వేయర్లను రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన నియమించాలని సూచించారు. భూ రికార్డుల తప్పుల సవరణలకు ఫీజులు వసూలు చేయడాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ సర్వే జాయింట్ డైరెక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ అసైన్డ్ భూమి పేరు సవరణకు, ఇండ్ల స్థలాల పట్టాలకు కలెక్టర్ మాత్రమే సవరణ చేసే అధికారం రూల్స్‌లో పొందుపరిచారని గుర్తు చేశారు. ఎంఆర్‌వో, ఆర్డీవోలకు అధికారాలు కట్టబెట్టామని చెబుతున్నప్పటికీ వాస్తవంలో కనిపించడం లేదని పేర్కొన్నారు. సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, అభాది (గ్రామ కంఠం) భూముల రికార్డులు విడివిడిగా రాయాలని ఆదేశించడం సరైనదే ఐనప్పటికీ, ఇంత వరకు గ్రామాల్లో రెవెన్యూ అధికారుల నిర్ణయమే జరగలేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంతల చంద్రారెడ్డి, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు, పట్నం రాష్ట్ర కార్యదర్శి డిజి నర్సింహ్మారావు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు ప్రభులింగం, సహాయ కార్యదర్శి డిజి నరేంద్ర ప్రసాద్, రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షులు జక్కుల వెంకటయ్య, ఏఐకేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీందర్ తదితరులు మాట్లాడారు. భూ భారతిలో సవరణలు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్‌టేబుల్ సమావేశాలు, సదస్సులు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సమావేశం తీర్మానించింది.
భూభారతి తప్పులతడక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES