నవతెలంగాణ-హైదరాబాద్: కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాని సుప్రీంకోర్టు సోమవారం చీవాట్లు పెట్టింది. విచారణ నుండి తప్పించుకునేందుకు క్షమాపణలు చెబుతారా అని నిలదీసింది. మంత్రిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. మంత్రివి నిరర్ధకమైన, బుద్ధిహీనమైన వ్యాఖ్యలు అని జస్టిస్ సూర్యకాంత్ మండిపడ్డారు. విచారణ నుండి తప్పించుకునేందుకు కోర్టుకు క్షమాపణ చెప్పడంలో అర్థంలేదని అన్నారు. విజయ్ షా వ్యాఖ్యలు చేసిన వీడియో క్లిప్‌లను ధర్మాసనం వీక్షించిందని, ఆ క్లిప్‌లను కోర్టుకు కూడా తీసుకువెళ్లిందని అన్నారు. ఆ వీడియోల్లో చాలా అసభ్యకరమైన, దుర్వినియోగమైన పదాలను వాడారని మండిపడ్డారు. ఒక ప్రజాప్రతినిధి, అనుభవజ్ఞులైన రాజకీయ నేత బాధ్యతగా వ్యవహరించాలని, ప్రతి పదాన్ని ఆచితూచి మాట్లాడాలని అన్నారు. మీ వ్యాఖ్యలతో ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు.
మధ్యప్రదేశ్ కేడర్, డైరెక్ట్ రిక్రూట్ చేయబడిన ఐపిఎస్ అధికారులతో సిట్‌ను ఏర్పాటు చేయాలని ధర్మాసనం రాష్ట్ర డిజిపిని ఆదేశించింది. అయితే ఈ ముగ్గురు సభ్యుల్లో రాష్ట్రానికి చెందినవారు ఉండకూడదని, వారిలో ఒక మహిళ ఉండాలని సూచించింది. ఇన్‌స్పెక్టర్ జనరల్ హోదా కలిగిన ఐపిఎస్ అధికారి సిట్‌కి నేతృత్వం వహించాలని, మిగిలిన ఇద్దరూ ఎస్‌పి హోదా కలిగి ఉండాలని పేర్కొంది. మే 20 ఉదయం పది గంటలలోపు సిట్‌ను నియమించాలని సూచించింది. దర్యాప్తు వివరాలను సిట్ స్టేటస్ రిపోర్ట్‌లో సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. అరెస్ట్ నుండి మినహాయింపు కల్పించిన కోర్టు .. విచారణకు సహకరించాలని మంత్రిని ఆదేశించింది. తదుపరి విచారణను మే 28కి వాయిదా వేసింది.