– పది రోజులకోసారి బిల్లులు చెల్లించాలి
– ఇన్సెంటీవ్‌తోపాటు బకాయిలు విడుదల చేయాలి : పాల రైతుల రాష్ట్ర సదస్సులో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్
నవతెలంగాణ- ఆలేరుటౌన్
నష్టాల్లో కూరుకుపోయిన మదర్ డెయిరీకి ప్రభుత్వం రూ.50 కోట్లు ఇచ్చి ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణం వైఎస్‌ఎన్ గార్డెన్‌లో గురువారం నిర్వహించిన తెలంగాణ పాల రైతుల రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. మదర్ డెయిరీ, విజయ డెయిరీ, కరీంనగర్ డెయిరీ, ముల్కనూర్ డెయిరీలతో పాటు ప్రయివేటు డెయిరీలు తక్కువ రేటుకే పాల సేకరణ చేసి రైతులకు నష్టం చేకూర్చుతున్నాయని అన్నారు. భువనగిరి కలెక్టరేట్ దగ్గర ధర్నా చేశాక ప్రభుత్వం రూ.50 కోట్లు గ్రాంట్స్ రిలీజ్ చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం మదర్ డెయిరీ ఐదు బిల్లులు పెండింగ్‌లో ఉంచి పాడి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ అప్పుల్లో కూరుకుపోయిందని డెయిరీ ఆస్తులను అమ్మాలని పాలకవర్గం నిర్ణయించడం దారుణమన్నారు. నష్టాలకు కారణం రైతులు కాదని, పాలకవర్గాలు చేసిన తప్పిదాలే దీనికి కారణమని తెలిపారు. పాడి రైతుల కష్టార్జితంతో కూడబెట్టిన ఆస్తులను అమ్మేయాలనుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఇన్సెంటివ్‌ను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా లీటర్ పాలకు ఐదు రూపాయల ఇన్సెంటివ్ రైతుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా లీటర్ పాలకు రూ.80 చెల్లించాలని కోరారు. ప్రతి పది రోజులకోసారి పాల బిల్లులు చెల్లించాలన్నారు. ప్రయివేటు పాల సేకరణను నియంత్రించి పాల రైతులకు నష్టం జరగకుండా ధరలు పెంచి ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాలని కోరారు. పాడి పశువులకు 50శాతం సబ్సిడీపై దాణా ఇవ్వాలని, గడ్డి కోసే యంత్రాలను 80 శాతం సబ్సిడీపై ఇవ్వాలని అన్నారు.
పాల రైతులకు మూడు లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి పాల సంఘం రాష్ట్ర కన్వీనర్ మంగ నరసింహులు అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, తీగల సాగర్, సీనియర్ నాయకులు బొంతల చంద్రారెడ్డి, పెసరకాయల జంగారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మేక అశోక్ రెడ్డి, మాటూరి బాలరాజు గౌడ్, జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి, చీరిక అలివేలు, సంజీవరెడ్డి, మదర్ డెయిరీ మాజీ డైరెక్టర్లు దొంతిరి సోమిరెడ్డి, బిక్షపతి, కందాడి సత్తిరెడ్డి, బబ్బూరి పోశెట్టి, వివిధ సొసైటీల చైర్మన్లు సందిల భాస్కర్ గౌడ్, పి.భాస్కర్ రెడ్డి, ఎలగందుల నాగరాజు, దూడల సురేష్, జోగు శ్రీనివాస్, బాల్దా లక్ష్మమ్మ, మచ్చ భాస్కర్, గనెబోయిన విజయభాస్కర్, పొట్ట శీను, సూదగాని సత్య రాజయ్య, వడ్డేమాన్ బాలరాజు మొరిగాడి అశోక్, మొరిగాడి అంజయ్య పాల సంఘం చైర్మెన్లు, పాల రైతులు పాల్గొన్నారు.
పాడి రైతు సమస్యలపై సీఎంను కలుస్తాం..
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్
పాడి రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు వెతకాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ కోరారు. ఆలేరు మండల కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్, సాగర్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఎన్నికల వాగ్దానాల్లో రైతులకు ఇన్సెంటివ్‌గా ఇస్తామని చెప్పిన వాటికి బడ్జెట్‌లో తగిన కేటాయింపులు చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం చేశాయన్నారు. ప్రభుత్వ ఆదరణ కోసం రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారన్నారు. పాడి రైతుల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డిని కలు స్తామని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా పాడి రైతులం దరినీ సమీకరించి పెద్దఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కమిటీ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది, 22 లక్షల కుటుంబాలు ఈ పాడి మీదనే ఆధారపడి జీవిస్తున్నా యని తెలిపారు. ప్రభుత్వరంగంలోని విజయ డెయిరీ, సహకార రంగంలో ఉన్న మదర్ డెయిరీ నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో పాల ఉత్పత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ మంగ నరసింహులు, జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మదర్ డెయిరీని ఆదుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES