– ఆలస్యమైతే రాష్ట్రాలకు కారణాలు చెప్పాలి
– గవర్నర్ పంపే బిల్లులపై రాష్ట్రపతికి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
– జాప్యం జరిగితే కోర్టును ఆశ్రయించవచ్చని రాష్ట్రాలకు సూచన
భారత సర్వోన్నత న్యాయస్థానం నుంచి మరొక కీలక పరిణామం. ఆయా రాష్ట్రాల గవర్నర్లు నివేదించిన బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం భారత రాష్ట్రపతికి సూచనలు చేసింది. వాటిపై మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని నిర్దేశించింది. దీనితో పాటు మరిన్ని సూచనలను చేసింది. రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన బిల్లుల విషయంలో గవర్నర్ల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలకు అనుకూలంగా కీలక తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రపతికి సంబంధించి కీలక సూచనలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వాలకు.. ముఖ్యంగా బీజేపీయేతర రాష్ట్రాలకు కలిసి వస్తాయని రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు.
న్యూఢిల్లీ: గవర్నర్లు తనకు నివేదించిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. తమిళనాడు గవర్నర్ చర్యను తప్పుపడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు శుక్రవారం అందుబాటులోకి వచ్చాయి. వీటిలో రాష్ట్రపతి విధులకు సంబంధించి అనేక కీలకాంశాలు ఉండడం గమనార్హం. రాజ్యాంగంలోని 201 కింద రాష్ట్రపతి నిర్వర్తించే విధులు న్యాయ సమీక్షలకు లోబడి ఉంటాయని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌తో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ తన తీర్పులో స్పష్టం చేసింది. ఆర్టికల్ 201 ప్రకారం ఏదైనా ఒక బిల్లును గవర్నర్ రిజర్వ్ చేసినప్పుడు తాను దానిని ఆమోదిస్తున్నాననో లేదా నిలుపుదల చేస్తున్నాననో రాష్ట్రపతి ప్రకటిస్తారు. అయితే రాజ్యాంగంలో ఇందుకు కాలపరిమితి ఏదీ నిర్ణయించలేదు. అయితే బిల్లును రాష్ట్రపతి తన వద్ద నిరవధికంగా అలాగే ఉంచుకోకూడదని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. బిల్లును ఆమోదించడమో లేదా నిలిపివేయడమో చేయాలే తప్ప తన వద్ద దీర్ఘకాలం అట్టి పెట్టుకోకూడదని తేల్చి చెప్పింది. ‘ఈ విషయంలో రాజ్యాంగం కాలపరిమితి ఏదీ నిర్దేశించనప్పటికీ రాష్ట్రపతి తన చెప్పింది. ‘ఈ విషయంలో రాజ్యాంగం కాలపరిమితి ఏదీ నిర్దేశించనప్పటికీ రాష్ట్రపతి తన అధికారాన్ని సహేతుకమైన సమయంలో ఉపయోగించాల్సి ఉంటుంది. ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి ఉపయోగించుకునే అధికారాలు చట్టం యొక్క సాధారణ సూత్రానికి అడ్డంకి కాకూడదు’ అని తెలిపింది. ఒకవేళ రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడంలో మూడు నెలలకు పైబడి జాప్యం జరిగితే అందుకు కారణాలను నమోదు చేసి సంబంధిత రాష్ట్రానికి పంపాలని సూచించింది. ‘పరిశీలన కోసం గవర్నర్ నుంచి వచ్చిన బిల్లులపై అవి అందిన మూడు నెలల్లోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని మేము సూచిస్తున్నాం. ఆ లోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోని పక్షంలో బాధిత రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. రాజ్యాంగ చెల్లుబాటుకు సంబంధించి తలెత్తిన ప్రశ్నల కారణంగా బిల్లును రిజర్వ్ చేసిన పక్షంలో న్యాయస్థానాలు నిర్వహించాల్సిన పాత్రను వారు తీసుకోకూడదు. అలాంటి ప్రశ్నలు ఏవైనా తలెత్తితే ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టుకు నివేదించాలి. మేము గవర్నర్, రాష్ట్రపతి చేతులు కట్టేసినట్లుగా భావించకూడదు. ఏదైనా బిల్లులో న్యాయపరమైన అంశాలు ఉన్నట్లయితే రాజ్యాంగ కోర్టులు మాత్రమే వాటిని అధ్యయనం చేసి సిఫార్సులు చేయగలవు’ అని అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో వివరించింది.
మూడు నెలల్లో నిర్ణయం తీసుకోండి
- Advertisement -
RELATED ARTICLES