నవతెలంగాణ-హైదరాబాద్: ట్రంప్ 2.0లో చైనాపై టారిఫ్ల పేరుతో వాణిజ్య యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. ఆదేశ వస్తువులపై సుంకాన్ని 145 శాతానికి పెంచారు. దీనికి ప్రతిగా చైనా కూడా అగ్రరాజ్య ఉత్పత్తులపై 125 శాతం టారిఫ్లు ప్రకటించింది. అమెరికా, చైనా మధ్య ప్రతీకార సుంకాలతో హీట్ పుట్టిస్తుండగా..తాజాగా ఆరెండు దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో అమెరికా సుంకాలకు భయపడి తాము వారి ముందు మోకరిల్లమని పేర్కొంటూ బీజింగ్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసింది. ‘అమెరికా ప్రపంచవ్యాప్తంగా టారిఫ్ అనే తుపాను రేపింది. ఉద్దేశపూర్వకంగా చైనాను లక్ష్యంగా చేసుకుంది. ఇతర దేశాలతో 90 రోజుల పాజ్ అనే గేమ్ ఆడుతోంది. బీజింగ్ వాణిజ్యాన్ని దెబ్బతీయాలని చూస్తోంది. వేధింపులకు తలొగ్గడం అంటే.. గొంతు తడుపుకోవడం కోసం విషం తాగడంతో సమానం. ఇది సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది’ అని వీడియోలో పేర్కొంది.
అయితే ఇటీవల డొనాల్డ్ ట్రంప్..చైనా టారిఫ్ల విషయంలో తమకు టచ్ లో ఉందని ఆయన పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన చైనా..అలాంటివి ఏమిలేదని కుండబద్దలు కొట్టింది. నిన్న చైనా ప్రతినిధులతో తాను ఫోన్లో మాట్లాడినట్లుగా ట్రంప్ చెప్పారు. కానీ తాము ఎవరితో మాట్లాడలేదని, యూఎస్ అవాస్తవాలు ప్రచారం చేస్తుందని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. ఇటీవల చైనా దిగుమతులపై సుంకాలు తగ్గుతాయని అమెరికా ప్రెసిడెంట్ సానుకూలంగా పేర్కొన్నారు. కానీ తాజా పరిణామాలతో బలమైన ఆర్థిక దేశాల మధ్య మరోసారి వివాదం ముదురుతోంది. ఈ రెండు దేశాల మధ్య మాటల యుద్ధం ఏ పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.