Wednesday, April 30, 2025
Homeతాజా వార్తలురజతోత్సవ సభను విజయవంతం చేసుకుందాం

రజతోత్సవ సభను విజయవంతం చేసుకుందాం

– బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ-ఎల్కతుర్తి

రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు తరలిరావాలని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో ఈ నెల 27న నిర్వహించనున్న రజతోత్సవ సభ ప్రాంగణాన్ని నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ముందుగా కాశ్మీర్‌లో టెర్రరిస్టుల దాడిలో మృతిచెందిన టూరిస్టులకు సంతాపం తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్‌ నాయకత్వంలో 24 ఏండ్ల క్రితం 2001 ఏప్రిల్‌ 27న పార్టీ ఉద్యమ సంస్థగా ఏర్పడిందన్నారు. దేశంలో ఎన్నో పార్టీలు పుట్టి కనుమరుగయ్యాయని, కానీ బీఆర్‌ఎస్‌ 24 ఏండ్లు పూర్తిచేసుకొని ముందుకు పోతున్నదని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో నిలదొక్కుకున్నవి రెండే రెండు పార్టీలని.. ఒకటి.. ఎన్టీఆర్‌ నాయకత్వంలో తెలుగుదేశం, రెండోది ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ అని అన్నారు. ఒక జనతా గ్యారేజ్‌లా హైడ్రా బాధితులు, యూనివర్సిటీ విద్యార్థుల గొంతుతో, లగచెర్ల బాధితులకు అండగా మళ్ళీ ఉద్యమం మొదలు పెట్టడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా సభ ప్రాంగణానికి దగ్గర్లోనే 1000 ఎకరాల్లో పార్కింగ్‌ స్థలం ఏర్పాటు చేశామన్నారు. వేసవి కాబట్టి 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 10 లక్షల తాగునీటి ప్యాకెట్లు, అలాగే వడదెబ్బ తగిలితే ఏదైనా అవసరం ఉంటే 100మంది వైద్య బృందాన్ని, అంబులెన్స్‌లతో పాటు తాత్కాలిక టాయిటెట్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కాబట్టి కరెంట్‌ సప్లరు మీద నమ్మకం లేదని, అందుకే 200 జనరేటర్లతో ప్రత్యేక పవర్‌ సప్లరు సిద్ధం చేశామని అన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నాయ కులు కష్టపడి సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారంటూ వారికి కృతజ్ఞ తలు తెలిపారు. సూర్యాపేట నుంచి ఎడ్ల బండ్లు ఇక్కడికి బయలు దేరా యని, అక్కడ రైతన్నలు జిల్లా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నా రని తెలిపారు. 2000 మంది వాలంటీర్లతో సభలో సేవలు అందిస్తారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న అరాచకాలను ఎండ కట్టడానికి, వారిని ప్రశ్నించడానికి, బీజేపీని నిలదీయడానికి ప్రతి ఒక్కరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. 27న ఎక్కడికక్కడ గులాబీ జెండాలు ఎగురవేసి వరంగల్‌ సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సభా ప్రాంగణాన్ని పరిశీలించినవారిలో.. బీఆర్‌ఎస్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షులు వినరు భాస్కర్‌, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే విడుదల సతీష్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img