Sunday, August 3, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంరష్యా నుంచి చమురు కొనుగోలు ఆపితే మంచిదే : ట్రంప్‌

రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపితే మంచిదే : ట్రంప్‌

- Advertisement -

అలాంటిదేమీ లేదు : ప్రభుత్వ వర్గాలు
వాషింగ్టన్‌ :
భారత్‌కు చెందిన ప్రభుత్వ రంగ రిఫైనరీలు రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేశాయంటూ వస్తున్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇది నిజమో కాదో తాను చెప్పలేనని అంటూనే ఇదో మంచి చర్య అని వ్యాఖ్యానించారు. ‘రష్యా నుంచి భారత్‌ ఇంకెంతో కాలం చమురును కొనుగోలు చేయబోదని నేను అర్థం చేసుకున్నాను. నేను విన్నది అదే. అది నిజమో కాదో నాకు తెలీదు. అది మంచి చర్య. ఏం జరుగుతుందో చూస్తాం’ అని ట్రంప్‌ విలేకరులతో అన్నారు. కాగా ఈ వార్తలను భారత ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. మార్కెట్‌ గమనం, దేశ ప్రయోజనాల ఆధారంగానే భారత ఇంధన నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశాయి. రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్న దేశాలపై భౌగోళిక రాజకీయ ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా ప్రయత్నిస్తున్న తరుణంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. చమురు అమ్మకాల ద్వారా వస్తున్న సొమ్మును ఉక్రెయిన్‌పై యుద్ధం చేయడానికి రష్యా వినియోగిస్తోందని అమెరికా ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. ప్రపంచంలో చమురునుఅత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశాలలో భారత్‌ మూడో స్థానంలో ఉంది. 2022లో పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన తర్వాత ఆ దేశం నుండి రాయితీపై భారత్‌ చమురును కొనుగోలు చేస్తోంది. రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తోందన్న సాకుతోనే భారత్‌ ఉత్పత్తులపై ట్రంప్‌ 25 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే.
రాయితీలు తగ్గడం, రవాణాలో ఎదురవుతున్న సవాళ్ల కారణంగా రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయాలని ప్రభుత్వ రంగంలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం, భారత్‌ పెట్రోలియం కంపెనీలు నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. ధరలు, క్రూడ్‌ గ్రేడ్‌, ఇన్వెంటరీలు, లాజిస్టిక్స్‌, ఇతర ఆర్థిక అంశాల ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశాయి. ఈ విషయంలో భారత్‌ వైఖరి స్పష్టంగా ఉన్నదని విదేశాంగ శాఖ ప్రతినిధి రణదీప్‌ జైస్వాల్‌ చెప్పారు. ‘ఇంధనానికి సంబంధించి మా వైఖరి మీకందరికీ తెలుసు. ఇంధన అవసరాలను తీర్చుకునే విషయంలో మా వైఖరి మార్కెట్లలో ధరలు, అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడి
ఉంటుంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -