Wednesday, April 30, 2025
Homeతాజా వార్తలురాజ్యాంగాన్ని మార్చడమంటే ప్రజాస్వామ్యంపై దాడే

రాజ్యాంగాన్ని మార్చడమంటే ప్రజాస్వామ్యంపై దాడే

– రాష్ట్రాల హక్కులపై మోడీ సర్కారు దాడి
– మతభావజాలంతో పాలన ప్రమాదకరం
– సామాజిక విప్లవకారుడు అంబేద్కర్‌ ఆశయాల కోసం పనిచేద్దాం : చుక్కరాములు
– ఆర్థిక, సామాజిక సమానత్వం కోసమే అంబేద్కర్‌ పోరాడారు : సుదీప్‌దత్తా
– కార్పొరేట్‌, మతోన్మాద విధానాలను తిప్పికొడదాం : పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆర్‌ఎస్‌ఎస్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చే కుట్ర చేస్తున్నదనీ, ఇలా చేయడమంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే అవుతుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ఆ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌ అధ్యక్షతన అంబేద్కర్‌ జయంతిని నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ఆలిండియా కార్యదర్శి సుదీప్‌ దత్తా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌లు అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ..పదేండ్ల కాలంలో మోడీ సర్కారు అధికారాన్ని అడ్డంపెట్టుకుని అన్ని రంగాల్లోకి కార్పొరేట్‌, మతోన్మాద విధానాలను దూకుడుగా ముందుకు తీసుకెళ్తూ రాజ్యాంగంపై దాడికి సిద్ధమైందని విమర్శించారు. పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో 400 సీట్లు గెలిస్తే ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తామని ఆ పార్టీ నేతలు చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. మహిళలకు ఆస్తి హక్కు, బడుగుబలహీన వర్గాల జీవితాల బాగు కోసం కొట్లాడితే..నేడు బీజేపీ పాలనలో మహిళలు, దళితులు, వెనుకబడిన సామాజిక తరగతులపై దాడులు తీవ్రమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్‌ ప్రతిపాదించిన ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా ముందుకెళ్తూ రాష్ట్రాల హక్కులను మోడీ సర్కారు హరిస్తున్న తీరును ఎండగట్టారు. పాలనపరమైన అంశాల్లో మతాన్ని జోడించకూడదని అంబేద్కర్‌ చెబితే…ఫక్తు మతభావజాలాన్ని బీజేపీ పాలనలో జొప్పిస్తున్నదని విమర్శించారు. అంబేద్కర్‌ ఆశయాల సాధన కోసం బీజేపీ విధానాలపై కార్మికులు పోరాడాలని పిలుపునిచ్చారు. సుదీప్‌దత్తా మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక, సామాజిక, మహిళా సమానత్వం రావాలని డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ తన జీవితాంతం పోరాడారని, కానీ, నేడు అధికారంలో ఉన్న మోడీ సర్కారు వారి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నదని విమర్శించారు. దేశంలోని ప్రభుత్వ ఆస్తులను, సహజ వనరులను మోడీ సర్కారు కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెడుతున్న తీరును ఎండగట్టారు. ఆర్థిక సమానత్వం రావాలని అంబేద్కర్‌ కోరుకుంటే బీజేపీ పదేండ్ల పాలనలో దేశంలో పేదల సంఖ్య 90 శాతానికి పెరిగిందనీ, దేశ సంపద మాత్రం కొందరి చేతుల్లో పేరుకుపోతున్నదని వాపోయారు. అంబేద్కర్‌ కోరుకున్నట్టుగా ఆర్థిక, సామాజిక, మహిళా సమాన త్వం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కార్మికులు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. పాలడుగు భాస్కర్‌ మాట్లాడు తూ..అంబేద్కర్‌ అనేక ఇబ్బందులను ఎదుర్కొని నిలబడ్డారనీ, భారత రాజ్యాంగ నిర్మాతగా ప్రసిద్ధి పొందారని చెప్పారు. పాలకులు చిత్తశుద్ధితో రాజ్యాంగాన్ని అమలు చేస్తే సత్ఫలితాలుంటాయనీ, పాలకుల్లో చిత్తశుద్ధి లోపిస్తే ఈ రాజ్యాంగం పనికిమాలినది అవుతుందనీ, అలాంటి సందర్భం వస్తే ఈ రాజ్యాంగం నిష్ప్రయోజనమని అంబేద్కర్‌ ఆనాడే జోస్యం చెప్పారని గుర్తు చేశారు. అంబేద్కర్‌ ఆశయాలకు భిన్నంగా బరితెగించి కార్పొరేట్‌, మతోన్మాద విధానాలను అమలు చేస్తున్నదనీ, అణగారినవర్గాల హక్కులను కాలరాస్తున్నదని విమర్శించారు. ఆ విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ సీనియర్‌ నాయకులు పి. రాజారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య, వీఎస్‌. రావు, ఎం. పద్మశ్రీ, రాష్ట్ర కార్యదర్శులు కె. ఈశ్వర్‌రావు, కూరపాటి రమేష్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు పి. సుధాకర్‌, వై. సోమన్న, ఎస్‌ఎస్‌ఆర్‌ఎ. ప్రసాద్‌, ఎ. సునీత, రాష్ట్ర కమిటీ సభ్యులు కిరణ్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img